కొత్తగూడెం ఎడ్యుకేషన్, జూన్ 10: ‘మన ఊరు – మన బడి’కి ఎంపిక చేసిన 368 పాఠశాలల్లో 365 పాఠశాలలకు మరమ్మతుల నిర్వహణకు పరిపాలనా అనుమతులు పూర్తయ్యాయని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఆ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ‘మన ఊరు – మన బడి’, ‘దళితబంధు’ పథకాలపై మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశం ఆయన మాట్లాడారు.
సాంకేతిక పరమైన అనుమతులు లభించి ఎఫ్‌టీవో జనరేట్ అయిన వెంటనే నిధులు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. ఎఫ్‌టీవో జనరేట్ చేయడంలో జాప్యం చేయొద్దని, దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ వారం రోజుల్లో మొత్తం పూర్తి చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు. యూనిట్ల ఏర్పాటుకు ఇన్వాయిస్ ప్రకారం ఫర్మ్‌లకు నిధులు చెల్లించాలన్నారు.
యూనిట్ల నిర్వహణను ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ప్రత్యేక అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. పనుల నిర్వహణపై రోజువారీ నివేదికలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పనులను వేగవంతం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ముత్యం, డీఈవో సోమశేఖరశర్మ, దళితబంధు ప్రత్యేక అధికారులు మధుసూదన్‌రాజు, మరియన్న, సీతారాం, వెంకటేశ్వర్లు, బీమ్లా పాల్గొన్నారు.