ఇల్లెందు రూరల్, జూన్ 10: కరోనా మానవాళికి కొత్త పాఠాలు నేర్పింది. ఆరోగ్య సూత్రాలను వంటపట్టించింది. తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా అలవాట్లను మార్చింది. రోగ నిరోధకశక్తి ఉంటే ఎలాంటి వ్యాధులనైనా తరిమికొట్టొచ్చని భావించిన జనం తమ ఆహార అలవాట్లను మార్చుకున్నారు. ఆరోగ్య సంరక్షణ కోసం జిమ్‌కు వెళ్తున్నారు. యోగా సాధన చేస్తున్నారు. క్రమం తప్పకుండా మార్నింగ్ వాక్ చేస్తున్నారు. ఇలా ఒకటేమిటి .. మార్పులు అనేకం.
పిజ్జాలు, బర్గర్లు, చికెన్ బిర్యానీలు, మటన్ కబాబ్స్, మండీల కల్చర్ రోజురోజుకూ ఎలా పెరిగిపోతున్నదో మరోవైపు ‘రా ఫుడ్’ తీసుకునే వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతున్నది. గతంలో ఇడ్లీ, దోశె, పూరీలు, బోండాలు తిన్న వారు ఇప్పుడు జొన్నరొట్టెలు, రాగి జావ, జొన్న జావ, గోధుమ రొట్టెలు తింటున్నారు. మరికాస్త ఆర్థిక వనరులు ఉన్న వారు కొర్రలు, సామలు, ఊదలు కొంటున్నారు. వాటినే ఆహారంగా తీసుకుంటున్నారు. రోజు తీసుకునే ఆహారంలో చిరుధాన్యాలు ఉండేలా జాగ్రత్త వహిస్తున్నారు.
మరో విశేషం ఏమిటంటే పట్టణాల్లో ఇప్పుడు జొన్నరొట్టెలు, రాగి జావ, జొన్న జావ సెంటర్లూ వెలిశాయి. జనం ఇప్పుడు కాఫీ, టీలకు బదులు గ్రీన్ టీ, లెమన్ టీలు తాగుతున్నారు. కరోనా నేర్పిన మరోపాఠం ఫిట్నెస్. ఇప్పుడు జనం ఫిట్‌నెస్‌కు కొంత సమయం కేటాయిస్తున్నారు. యోగా, నడక, వ్యాయామం చేస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు ఇప్పుడు పాత అలవాట్లనే తిరిగి ప్రజలు అలవాటు చేసుకుంటున్నారు.