మణుగూరు రూరల్, జూన్ 10: సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తిలో ముందుండేందుకు ప్రయత్నించే మణుగూరు ఏరియా కార్మికులకు సంక్షేమాన్ని అందించడంలోనూ యాజమాన్యం వెనుకడుగు వేయడం లేదు. టీబీజీకేఎస్ వినతుల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించి వాటిని పరిశీలించి మరమ్మతులకు నిధులు మంజూరు చేయించేందుకు ప్రాధాన్యతనిస్తున్నది.
2017లో సీఅండ్ఎండీ శ్రీధర్ ప్రారంభించిన అంబేద్కర్ పార్కు పీవీకాలనీలో ఉంది. కరోనా నేపథ్యంలో పార్కును మూసివేయడంతో పర్యవేక్షణ లేక కళా విహీనంగా మారింది. కరోనా విముక్తి అనంతరం పార్కును ప్రారంభించినప్పటికీ సౌకర్యాలు, ఆట వస్తువులు మరమ్మతులకు నోచుకోవడంతో కార్మిక కుటుంబాలు పార్కు వినియోగానికి ఆసక్తి కనబర్చలేదు. టీబీజీకేఎస్ నేతల వినతుల మేరకు ఏరియా జీఎం, కార్మిక నేతలతో కలిసి పర్యటించి పార్కును పరిశీలించారు.
వెంటనే మరమ్మతులు చేయించడంతో పాటు అందమైన పూల మొక్కలు నాటాలని ఆదేశించారు. సుమారు రూ.15లక్షలతో ఆహ్లాదం కలిగించే మొక్కలతోపాటు మరమ్మతులకు గురైన ఫౌంటేన్ మోటార్ల రిపేరు, లైటింగ్, ఉయ్యాలలు, జారుడుబండ, వాకింగ్ ట్రాక్‌ను మెరుగుపరిచారు. నిలిచిపోయిన బోటింగ్‌కు రిపేర్లు పూర్తిచేసి ప్రారంభించారు. మొదటిదశలో రూ. 15లక్షలతో స్కూల్ దగ్గర నుంచి పార్కు మెయిన్ గేట్ వరకు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయించారు.
కార్మికుల సంక్షేమం కోసం అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తూ పనులు చేపడుతున్న యాజమాన్యానికి ధన్యవాదాలు. కమ్యూనిటీ హాల్‌కు ఏసీ సౌకర్యంతో పాటు సింథటిక్ కోర్టు ఏర్పాటుకు కృషి చేసిన ఏరియా జీఎంకు ప్రత్యేక అభినందనలు. సింగరేణి కల్పిస్తున్న సౌకర్యాలను సింగరేణీయులు సద్వినియోగం చేసుకోవాలి.
– టీబీజీకేఎస్ నేత వీ ప్రభాకర్‌రావు
అంబేద్కర్ పార్కును అం దంగా తీర్చిదిద్దారు. సాయం త్రం మాత్రమే పార్కును తెరుస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఉదయం సమయంలో అనుమతిస్తే పిల్లలకు ఉల్లాసంగా గడపడానికి అవకాశం ఉంటుంది. వాకింగ్ ట్రాక్ మెరుగుపడింది. బయట నుంచి ఎవరూ పార్కులోకి రాకుండా పూర్తి స్థాయిలో చుట్టూ ఫెన్సింగ్ వేస్తే బాగుంటుంది.
– దస్తగిరి స్థానికుడు