గాలివాన బీభత్సం సృష్టించింది.. ఆది వారం మధ్యాహ్నం వరకూ భానుడు తన ప్రతాపాన్ని చూపించాడు.. మండుతున్న ఎండలతో ప్రజలంతా అల్లాడిపోయారు.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.. బల మైన ఈదురుగాలులు వీచడంతో భారీ వృక్షాలు, హోర్డిం గులు నేలకూలాయి.. పలు ప్రాంతాల్లో ఇండ్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి. వర్షంతో ప్రయాణికులు అసౌకర్యానికి గుర య్యారు. మణుగూరు సింగరేణి ఓసీలో బొగ్గు, ఓబీ రవాణా, వెలికితీతకు అంతరాయం ఏర్పడింది.
భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ కొత్తగూడెం అర్బన్, మే 29: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురిసింది. వాతావరణమంతా సాయంత్రం ఒక్కసారిగా చల్లబడింది. కాసేపటికే బలమైన ఈదురుగాలులు వీచి బీభత్సం సృష్టించాయి. దీంతో కొత్తగూడెం పట్టణంలో వృక్షాలు నేలకొరిగాయి. హోర్డింగులు విరిగిపడ్డాయి. రైల్వే స్టేషన్ ఆవరణలో భారీ వృక్షం నేలకొరిగింది. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఆవరణలో ఓ చెట్టు కూలింది.
భద్రాచలంలోని హరిత హోటల్ వద్ద ఓ చెట్లు కూలి ఓ వ్యాన్‌పై పడింది. మణుగూరు పీవీకాలనీలోని ఆర్డినరీ డీ 831 క్వార్టర్‌పై భారీ వృక్షం విరిగి పడింది. గదులపై రేకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో ఆ ఇంట్లో కార్మికుడి భార్యతోపాటు శిశువు ఉన్నారు. వారికి తృటిలో ప్రమాదం తప్పింది. మణుగూరు సింగరేణి ఓసీలో బొగ్గు, ఓబీ రవాణా, వెలికితీతకు కొంత అంతరాయం ఏర్పడింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండాలపాడు వద్ద హైవేపై చెట్టు విరిగి కారు ముందు భాగంపై పడింది.
వెంటనే బెలూన్లు తెరుకోవడంతో అందులోని ప్రయాణిస్తున్న వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. కొత్తగూడెం త్రీటౌన్ సెంటర్లో పెద్ద చెట్టు విరిగి పోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రైల్వే అండర్ బ్రిడ్జిలోకి భారీగా వర్షపు నీరు చేరింది. పలు చోట్ల విద్యుత్ తీగెలు తెగిపడ్డాయి. అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు.