కొణిజర్ల, మే 29:కోటి ఆశలతో సాగు చేసిన మిర్చి పంట బ్లాక్త్రిప్స్ (నల్లతామర) ఉధృతికి తుడిచి పెట్టుకుపోయింది. అప్పటికే రూ.లక్షలు ఖర్చు చేసిన రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు ఎదురు చూస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ప్రస్తుతం మార్కెట్లో పత్తి పంటకు డిమాండ్ కన్పించింది. దీంతో వారు యాసంగిలో పత్తి సాగుకు నడుంబిగించారు. దీంతో మండల వ్యవసాయాధికారి సలహాలు, సూచనలు పాటించి ఎకరాకు 12 నుంచి 14 క్వింటాళ్ల దిగుబడితో తోటి రైతులకు ఆదర్శంగా నిలిచాడో ఓ రైతు.
కొణిజర్ల మండలం బస్వాపురం గ్రామానికి చెందిన రైతు మల్లెంపాటి వెంకటేశ్వర్లు ఈ ఏడాది వానకాలంలో తన సొంత పొలంతోపాటు భూమి కౌలుకు తీసుకున్న 8 ఎకరాల్లో మల్చింగ్, డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకొని మిర్చి సాగు చేశాడు. కాగా రసం పీల్చే పురుగు, నల్ల తామర ఉధృతితో మిర్చి పంట కాత, పూత లేకుండా పోయింది. దీంతో అధైర్యపడని ఆ రైతు.. స్థానిక ఏవో బాలాజీను కలిసి పత్తి సాగు చేసేందుకు సలహా కోరాడు.
అప్పటి వరకు యాసంగిలో సిఫార్సు లేని ఆ పంటను రెండు, మూడు ఎకరాల్లో సాగు చేయాల్సిందిగా ఏవో సూచించారు. అయినప్పటికీ ఆ రైతు సాహసోపేతంగా అప్పటికే ఏర్పాటు చేసిన నీటి సౌకర్యంతో 8 ఎకరాల్లో డిసెంబర్లో పత్తి నాటాడు. స్వల్ప పెట్టుబడితో సస్యరక్షణ చర్యలు పాటిస్తూ పత్తి సాగు చేపట్టాడు. పత్తి ఏపుగా పెరిగి చెట్టుకు 70 నుంచి 80 కాయల వరకూ వచ్చాయి.
వానకాలం పంట కన్నా భిన్నంగా రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా తక్కువగా ఉన్నట్లు రైతు వెంకటేశ్వర్లు తెలిపాడు. మొత్తంగా ఎకరాకు 12 నుంచి 14 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని, మొత్తంగా రూ.2.5 లక్షల నుంచి రూ.2.7 లక్షల వరకు పెట్టుబడి వ్యయం అయిందని వివరించాడు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో పత్తికి గరిష్ట ధర లభించడంతో సుమారు రూ.13 నుంచి రూ.14 లక్షల మేర ఆదాయం రానున్నట్లు రైతు చెప్పాడు.
వానకాలం పంటకు భిన్నం ఎండాకాలంలో పత్తి పంట నిర్వహణ కొనసాగిందని రైతు తెలిపాడు. తనకున్న 15 ఎకరాల్లో వానకాలంలో పత్తి సాగు చేయగా అది ఆశించిన మేర దిగుబడి అందలేదని, మిర్చి స్థానంలో మల్చింగ్, డ్రిప్ విధానంలో సాగు చేసిన పత్తిపంటలోనే అధిక ఆదాయం చేకూరుతుందని చెప్పాడు. ఎకరాకు ఒక ప్యాకెట్ చొప్పున పత్తి విత్తనాలు నాటానని, భాస్వరం, పొటాషియం ఎరువులను డ్రిప్ ద్వారా వ్యవసాయ శాఖ సూచించిన మోతాదు ప్రకారమే వేసినట్లు చెప్పాడు. కాత, పూత దశలో రసం పీల్చే పురుగులు, కాయతొల్చే పురుగులు, గులాబీరంగు పురుగుల నివారణ కోసం ఎప్పటికప్పుడు రసాయనిక మందులు, వేపనూనె సంబంధిత మందులతో పిచికారీ చేసినట్లు వివరించాడు.
ఏటా మిర్చిలో అధిక దిగుబడి రావడంతో కోటి ఆశలతో తొలుత సన్నరకం మిర్చి సాగు చేశా. ఎకరాకు రూ.50 వేల వరకు పెట్టుబడి పెట్టా. తామరపురుగు ఉధృతితో కాత, పూత నాశనమైంది. ప్రస్తుత మార్కెట్లో పత్తికి మంచి డిమాండ్ ఉండడంతో ధైర్యం చేసి 8 ఎకరాల్లో యాసంగిలో పత్తి సాగు చేశా. డిసెంబర్లో విత్తనాలు నాటా. మే నెల చివరి నాటికి పూర్తిగా పంట చేతికొచ్చే అవకాశముంది. యాసంగి సాగే కలిసొచ్చింది.
-మల్లెంపాటి వెంకటేశ్వర్లు, యువ రైతు, బస్వాపురం
శాస్త్రీయ పద్ధతిలో సాగు చేస్తే వేసవిలోనూ పత్తి పంట అధిక దిగుబడులు ఇస్తుందని ఈ ప్రయత్నంతో అవగతమవుతోంది. ఈ విషయంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు మరింత లోతైన అధ్యయనం చేస్తే భవిష్యత్లో ఆనవాయితీ పంటలకు భిన్నంగా ఎండాకాలం పంటల్లో పత్తి కూడా ప్రత్నామ్నాయం కావచ్చు. దీనిపై మరింత అధ్యయనం కొనసాగాల్సి ఉంది.
– బాలాజీ, ఏవో, కొణిజర్ల