భద్రాద్రి కొత్తగూడెం, మే 23 (నమస్తే తెలంగాణ)/ ఖమ్మం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలో సోమవారం ప్రశాంత వాతావరణంలో పదోతరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 మధ్యాహ్నం 12:45 గంటల వరకు విద్యార్థులు పరీక్ష రాశారు. విద్యాశాఖ అధికారుల సూచనల మేరకు విద్యార్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా 104 కేంద్రాల్లో 17,543 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా తొలిరోజు 142 మంది గైర్హాజరయ్యారు. హాజరుశాతం 99.19 శాతం నమోదైంది.
భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 75 కేంద్రాల్లో 13,334 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా తొలిరోజు 13,080 మంది పరీక్షలు రాశారు. హాజరుశాతం 98.09 నమోదైంది. రాష్ట్రవిద్యాశాఖ ఆదేశాల మేరకు విద్యార్థులు యూనిఫాంతో కాకుండా సివిల్ డ్రెస్‌లోనే పరీక్షలకు హాజరయ్యారు. ప్రతి కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలైంది. పరీక్షా పత్రాలను అధికారులు భారీ భద్రత నడుమ తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ నగరంలోని జ్యోతి బాలమందిర్ పాఠశాల పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షల జిల్లా అబ్జర్వర్ ఎన్ఎస్ఎస్ ప్రసాద్ ఎర్రుపాలెం, మధిర మండలాల్లోని కేంద్రాలు, డీఈవో యాదయ్య రూరల్ మండలంలోని కేజీబీవీ, జలగంనగర్, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్, కొణిజర్ల పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించారు.
మొత్తంగా జిల్లా అబ్జర్వర్ ఏడు కేంద్రాలు, డీఈవో తొమ్మిది, ఫ్లయింగ్ స్కాడ్స్ 57 కేంద్రాలను తనిఖీ చేశారు. కొత్తగూడెం పట్టణంలోని బాబూక్యాంపు హైస్కూల్ కేంద్రాన్ని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ తనిఖీ చేశారు. తనిఖీ చేస్తున్నంత సేపు కలెక్టర్ తన మొబైల్‌ను పక్కన పెట్టడం విశేషం. డీఈవో సోమశేఖరశర్మ ములకలపల్లి, బూర్గంపాడు పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించారు.
నేలకొండపల్లి, మే 23: మండలంలోని రాజేశ్వరపురంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన పదోతరగతి విద్యార్థిని అనూష అంధురాలు. విద్యాశాఖ అధికారుల అనుమతితో అమ్మగూడెం గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని పూజితను పరీక్షలకు సహాయకరాలిగా ఎంచుకున్నది. సోమవారం అనూష, పూజిత మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల కేంద్రానికి వచ్చారు. విద్యార్థిని అనూష ప్రశ్నలకు జవాబులు వివరిస్తుండగా పూజిత ప్రశ్నాపత్రంలో రాసింది. అంధురాలికి సహాయకురాలిగా వచ్చిన పూజితను పలువురు అభినందించారు.