వైరా/ వైరా రూరల్, ఆగస్టు 22 : విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేయాల్సిన ప్రధానోపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుండడంతో హెచ్ఎం వ్యవహార శైలిని తమ తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు సోమవారం పాఠశాలకు వస్తున్న హెచ్ఎం కారును అడ్డగించి అద్దం పగలగొట్టి, అతడికి దేహశుద్ధి చేసి సర్పంచ్ ఇంట్లో నిర్భందించారు.
పూర్తి వివరాల్లోకెళ్తే.. వైరా మండలంలోని కేజీసిరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం సాలాది రామారావు కొన్నిరోజుల నుంచి విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని వారి తల్లిదండ్రులు ఆరోపించారు. తరగతి గదిలో పాఠాలు బోధించే సమయంలో చేతులు పట్టుకోవడం, శరీరభాగాలను తాకడం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా గాంధీజీ సినిమా ప్రదర్శన సమయంలో ఇద్దరు పదో తరగతి విద్యార్థినుల మధ్యలో కూర్చొని భుజాలపై చేతులు వేసి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలిపారు.
ఈ విషయంపై ఎంఈవో కొత్తపల్లి వెంకటేశ్వర్లుకు ఆదివారం ఫిర్యాదు చేసినట్లు తల్లిదండ్రులు వివరించారు. విద్యార్థుల చేత కాళ్లు కూడా పట్టించుకుంటున్నట్లు పేర్కొన్నారు. హెచ్ఎంను నిర్బంధించిన విషయం తెలుసుకున్న వైరా, తల్లాడ ఎస్సైలు శాఖమూరి వీరప్రసాద్, సురేశ్ గ్రామానికి చేరుకున్నారు. రామారావును తమ పెట్రోలింగ్ వాహనంలో వైరా పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తుండగా గ్రామస్తులు, తల్లిదండ్రులు పోలీస్ వాహనాన్ని అడ్డుకుని రామారావుకు మరోమారు దేహశుద్ధి చేశారు. హెచ్ఎంను తమకు అప్పగించాలని డిమాండ్ చేయడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి హెచ్ఎం రామారావును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.