బోనకల్లు (మధిర), మే 9 : ఖమ్మానికి దీటుగా మధిర పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. సోమవారం మధిర పట్టణంలో రూ.5.70 కోట్లతో చెరువు పునరుద్ధరణ, మినీ ట్యాంక్‌బండ్, రూ.4.50 కోట్లతో నిర్మించనున్న సమీకృత వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ పనులకు శంకుస్థాపన, మధిర పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో రూ.12 లక్షలతో నిర్మించిన వాటర్ ఫౌంటేన్, ఆత్కూరు గ్రామ కూడలిలో వాటర్ ఫౌంటేన్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు.
మల్లాది వాసు సేవా సంస్థ ఆధ్వర్యంలో పువ్వాడ ఫౌండేషన్ సమకూర్చిన 300 కుట్టుమిషన్లను మహిళలకు పంపిణీ చేశారు. బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి కౌన్సిలర్లు మల్లాది వాసు, సవిత నివాసం వద్ద ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. పట్టణాన్ని బంగారు మధిరగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఉమ్మడి పాలనలో పట్టణాలు కునారిల్లాయన్నారు. నేడు అన్ని రంగాల్లో మధిర పట్టణం దూసుకెళ్తున్నదన్నారు. పట్టణంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, శరవేగంగా పనులు జరుగుతున్నాయన్నారు.
త్వరలో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్‌రావు మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రజాసంక్షేమ పాలన కొనసాగుతున్న న్నదన్నారు. నాడు గుక్కెడు నీళ్ల కోసం ప్రజలు రోడ్డెక్కే పరిస్థితులు చూశామని, నేటి ప్రభుత్వం ప్రజలకు మిషన్ భగీరథ నీరు సరఫరా చేస్తున్నదన్నారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత భక్తరామదాసు ఎత్తిపోతల పథకం, బీటీపీఎస్ నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కోసం పార్లమెంట్లో మాట్లాడలేని బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు టీఆర్ఎస్పై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు.
కాంగ్రెస్ నేతలు జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్తున్నారని మండిపడ్డారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ&మధిర అభివృద్ధికి ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించామన్నారు. పట్టణాభివృద్ధికి తనవంతు బాధ్యతగా పనిచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మధిర ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క, కలెక్టర్ వీపీ గౌతమ్, అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, ఆర్డీవో రవీంద్రనాథ్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ మొండితోక లత, వైస్ చైర్మన్ శీలం విద్యాలత, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు రావూరి శ్రీనివాసరావు, కనుమూరి వెంకటేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.