మామిళ్లగూడెం, నవంబర్ 16: సైబర్ నేరాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం పోలీసు కమిషనర్ (సీపీ) సునీల్‌దత్ సూచించారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అందిస్తామనే ప్రకటనలకు మోసపోవద్దని సూచించారు. అలాంటి చిట్కాలు, ఆఫర్లను నమ్మవద్దని అన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనల విడుదల చేశారు.కొత్త కంపెనీ లేదా ప్రసిద్ధ సంస్థ పేరు మీద ఐపీవో వస్తుందని, తక్కువ ధరలో షేర్లు అందుబాటులో ఉన్నాయని, త్వరగా షేర్లు తీసుకుంటే ఎక్కవ లాభం వస్తుందని చెబుతూ సామాజిక మాధ్యమాల్లో వచ్చే సందేశాలను నమ్మవద్దని సూచించారు.
ఐపీవోల్లోగానీ, షేర్లలోగానీ పెట్టుబడులు పెట్టేముందు సెబీ లేదా ఎన్ఎస్ఈ లేదా బీఎస్ఈ అధికారిక వెబ్సైట్లో ధ్రువీకరించుకోవాలని సూచించారు. సోషల్‌మీడియా ద్వారా గానీ, లేదా వ్యక్తుల నుంచి గానీ వచ్చే ఆఫర్లను నమ్మవద్దని సూచించారు. పెట్టుబడులు పెట్టాలంటూ వీడియోకాల్, వాట్సాప్‌ల ద్వారా ఎవరైనా ఒత్తిడి చేస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అన్నారు.
ఖమ్మం జిల్లాలో శనివారం జరిగిన ప్రత్యేక లోక్ అదాలత్‌కు పోలీసు శాఖకు సంబంధించిన 5,838 కేసులు పరిష్కారమయ్యాయని, సైబర్ కేసుల్లో రికవరీ అయిన రూ.92 లక్షల మొత్తాన్ని బాధితులకు అందించామని సీపీ సునీల్‌దత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజీకి అవకాశం ఉండి పరిష్కరించిన కేసుల్లో ఎఫ్ఐఆర్ కేసులు 605, ఈ-పెట్టీ కేసులు 2,583, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 2,650, సైబర్ కేసులు 195 పరిష్కారమైనట్లు వివరించారు.