మామిళ్లగూడెం, సెప్టెంబర్ 12:గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరుగకుండా కచ్చితమైన ప్రణాళికతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఖమ్మం సీపీ సునీల్‌దత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 16న జరిగే గణేశ్ నిమజ్జన బందోబస్తు ఏర్పాట్లపై జిల్లాలోని పోలీస్ అధికారులతో ఖమ్మంలోని తన కార్యాలయం నుంచి గురువారం ఏర్పాటుచేసిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.
ఏ చిన్న ఘటనకూ ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో బారికేడ్లు, క్రేన్లు ఏర్పాటుచేయాలని, గజ ఈతగాళ్లు, లైఫ్ జాకెట్లు, పడవలను అందుబాటులో ఉంచాలని సూచించారు. విద్యుత్, మున్సిపల్, పంచాయతీ రాజ్, మత్స్యశాఖ అధికారులతో సమన్వయంతో పనిచేసి నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. భక్తులు, నిర్వాహకులు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు. వర్షాలు ఎక్కువగా ఉన్నందున నిమజ్జన కార్యక్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 27 వేల గణేశ్ విగ్రహాలు నమోదయ్యాయని, ఇప్పటి వరకు 243 విగ్రహాలు నిమజ్జనమయ్యాయని వివరించారు. అడిషనల్ డీసీపీలు నరేశ్‌కుమార్, ప్రసాదరావు, ఏసీపీ సాంబరాజు తదితరులు పాల్గొన్నారు.