మామిళ్లగూడెం, జూన్ 7 : టీజీపీఎస్సీ ఆదేశాల మేరకు గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఈ నెల 9న పకడ్బందీగా నిర్వహించాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫ్లయింగ్ స్వాడ్స్, డిపార్ట్మెంట్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లకు పరీక్ష నిర్వహణపై చేపట్టిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం మొదటిసారిగా బయోమెట్రిక్ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
జిల్లాలో మొత్తం 52 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 18,403 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థులు ఒకరోజు ముందుగానే తమ పరీక్షా కేంద్రాన్ని తెలుసుకోవాలని, హాల్ టికెట్లు టీజీపీఎస్సీ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రానికి ఉదయం 9 గంటలకే చేరుకోవాలని, ప్రతి కేంద్రంలో ఉదయం 10 గంటలకే గేట్లు మూసివేయాలని అధికారులను ఆదేశించారు. మహిళా అభ్యర్థులను తనిఖీ చేయడానికి ప్రత్యేకంగా మహిళా సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి అభ్యర్థి హాల్ టికెట్‌తోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి వెంట తెచ్చుకోవాలని సూచించారు.
హాల్ టికెట్‌పై అభ్యర్థి ఫొటో సరిగా లేకపోతే గెజిటెడ్ అధికారిచే అటెస్టెడ్ చేయించుకొని సొంత డిక్లరేషన్ రాసి ఇవ్వాలని, 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు వెంట తెచ్చుకోవాలని తెలిపారు. ఫ్లయింగ్ స్కాడ్, డిపార్ట్మెంట్ అధికారులకు కూడా పరీక్షా కేంద్రాల్లో సెల్ఫోన్లకు అనుమతి లేదన్నారు. అభ్యర్థులు షూస్, జ్యూవెల్లరీ వేసుకొని రావొద్దని, ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్, సెల్ ఫోన్లు, రికార్డింగ్ వస్తువులు, కాలిక్యులేటర్, వాచ్, రైటింగ్ ప్యాడ్లకు అనుమతి లేదన్నారు. కార్యక్రమంలో రీజినల్ కోఆర్డినేటర్లు, విజయ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.జాన్‌బాబు, ఎస్బీఐటీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.రాజ్‌కుమార్, జిల్లా అధికారులు, ఫ్లయింగ్ స్కాడ్, డిపార్ట్మెంట్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.