మామిళ్లగూడెం, జనవరి 2: మున్నేరు వరద నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ సూచించారు. మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణం, భూసేకరణ అంశాలపై అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, కేఎంసీ కమిషనర్ అభిషేక్‌లతో కలిసి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ, ఇంజినీరింగ్ అధికారులతో గురువారం ఆయన సమీక్షించారు. ‘మున్నేరుకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి బఫర్ జోన్, ఎఫ్టీఎల్ డిజైన్ ఏమిటి? గత రికార్డుల ప్రకారం అత్యధిక నీటి ప్రవాహం స్థాయి ఎంత? రిటైనింగ్ వాల్ ఎంత ప్రవాహానికి ఎంత ఎత్తులో నిర్మించాలి?’ వంటి అంశాలను నీటిపారుదల శాఖ ఎస్ఈ మంగళపుడి వెంకటేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు.
‘బఫర్ జోన్ వద్ద ఎంత భూమి ఆక్రమణకు గురైంది? మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఎంత సమయం పడుతుంది? ఎంత భూమి సేకరించాలి? వచ్చే వానకాలం నాటికి పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయా? రాబోయే వరదల నియంత్రణకు ఏ చర్యలు తీసుకోవాలి’ వంటి వివరాలను తెలుసుకొని మ్యాపులను పరిశీలించి సూచనలు చేశారు. అత్యధిక వరద ప్రవాహం ఉన్న సమయంలో మున్నేరు నదికి 3.50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినా తట్టుకునేలా రిటైనింగ్ వాల్ డిజైన్ చేశామని, గత రికార్డుల ప్రకారం మున్నేరు నది 36 మీటర్ల ఎ త్తులో ప్రవహించిందని, దానిని పరిగణనలోకి తీసుకుంటూ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించామని ఎస్ఈ వెంకటేశ్వరరావు వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించి ఆమోదం పొందిన డిజైన్ ప్రకారం అవసరమైన భూసేకరణ చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, ఇరిగేషన్ ఈఈ అనన్య, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు, ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్ తహసీల్దార్లు రవికుమార్, రాంప్రసాద్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.