మామిళ్లగూడెం, ఫిబ్రవరి 4: చరిత్ర ప్రతిబింబించే విధంగా జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, అందుకు అవసరమైన చర్యలను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులకు సూచించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, నగర పాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్యలతో కలిసి పురావస్తు, పర్యాటక శాఖ అధికారులతో నేలకొండపల్లి బౌద్ధ స్తూపం, పాలేరు లేక్, ఖమ్మం ఖిల్లా పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై సమీక్షించారు. ఆయా ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చారిత్రక ప్రాంతాల వద్ద సిమెంట్ కట్టడాలను తగ్గించాలని సూచించారు. ఆయా ప్రాంతాలకు సందర్శకులు వచ్చినప్పుడు వారికి చరిత్ర తెలిసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. బౌద్ధ స్తూపం వద్ద ఓపెన్ ఎయిర్ మ్యూజియం ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను తెలిపే విధంగా జాతీయ రహదారుల వెంట బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఖిల్లా వద్ద సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, ఖిల్లా చుట్టూ పెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో ఆర్డీవో నర్సింహారావు, ఆర్కిటెక్చర్ సత్యశ్రీనివాస్, సీనియర్ ఇంజినీర్ వెంకటేశ్, టూరిజం డీఈలు రామకృష్ణ, శ్రీధర్, పురావస్తు శాఖ ఏడీ బి.మల్లునాయక్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.