ఖమ్మం, జనవరి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రజాస్వామ్య, సార్వభౌమ, సామ్యవాద, లౌకిక వ్యవస్థల పునాదులపై మన రాజ్యాంగం రూపుదిద్దుకున్నదని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పేర్కొన్నారు. అందుకని దేశ ప్రజలకు, ముఖ్యంగా పేదలకు రాజ్యాంగ ఫలాలు అందిస్తూ దానికి సార్థకత చేకూరుస్తున్నామని అన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాలు చేపట్టిన ప్రతి అభివృద్ధి, సంక్షేమ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని గుర్తుచేశారు. ఖమ్మం జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతున్నామని స్పష్టం చేశారు. ఖమ్మంలోని పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో రిపబ్లిక్ డే (గణతంత్ర దినోత్సవం) వేడుకలు ఆదివారం కనుల పండువలా జరిగాయి. జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, స్వాతంత్య్ర సమరయోధుల సమక్షంలో జాతీయ పతాకాన్ని కలెక్టర్ ఎగురవేశారు.
ఈ సందర్భంగా మన రాజ్యాంగ విశిష్టతను, దాని ఆవిర్భావ నేపథ్యాన్ని గుర్తుచేశారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఖమ్మం జిల్లాలో 42,461 మంది రైతుల నుంచి 24,41 లక్షల క్వింటాళ్ల సన్నరకం ధాన్యం కొనుగోలు చేసి వారికి మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్ కూడా చెల్లించామన్నారు. పంటల సాగుపై రైతుల సందేహాలను నివృత్తి చేసి సలహాలు, సూచనలు చేసేందుకుగాను కలెక్టరేట్లో ప్రత్యేక కాల్‌సెంటర్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు.
రఘునాథపాలెంలో మంచుకొండ ఎత్తిపోతల పథకానికి రూ.66.33 కోట్లు మంజూరు చేశామన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా జిల్లాలోని 592 పాఠశాలల్లో రూ.12 కోట్లు ఖర్చు చేశామన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రిలో ప్రజలకు వైద్యసేవలను అందించేందుకు పక్కా ప్రణాళికలను అమలు చేస్తున్నామన్నారు. సత్తుపల్లి, మధిర ఆసుప్రతులను 100 బెడ్లతో అప్‌గ్రేడ్ చేసి నూతన భవనాలను ప్రారంభించామని; వైరా, కూసుమంచిలో 100 బెడ్ల ఆసుపత్రుల నిర్మాణాలకు స్థలాలను సేకరించామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 3,507 మంది రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు చెప్పారు.
జిల్లాలో ఐదు నియోజకవర్గాలకు 17,500 ఇండ్లు మంజూరయ్యాయని, పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను పూర్తి చేసి పేదలకు పంపిణీ చేసేందుకు పనులు వేగవంతం చేశామని అన్నారు. 2,40,504 లక్షల మంది గ్యాస్ సబ్సిడీ లబ్ధిదారులకు రూ.21. 31 కోట్లను జమ చేశామన్నారు. గృహజ్యోతి పథకంలో భాగంగా 2,57,995 పేద కుటుంబాలకు 200 యూనిట్ల చొప్పున విద్యుత్ అందిస్తున్నామన్నారు. భూ భారతి అమలులో భాగంగా 70 వేల దరఖాస్తులను పరిష్కరించామన్నారు. జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా జరుగుతున్నదని, ఖమ్మం నగరానికి రింగ్‌రోడ్డు ప్రతిపాదనల పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు.
టూరిజం అభివృద్ధిలో భాగంగా ఖమ్మం ఖిల్లాతోపాటు గుర్తించిన పలు ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయన్నారు. జిల్లాలో శాంతిభద్రతలు పటిష్ఠంగా అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందించారు. స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించారు. విద్యార్థుల కళాప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మైదానంలో స్టాళ్లు ఏర్పాటు చేశారు. సీపీ సునీల్‌దత్, అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ, శిక్షణ కలెక్టర్ మ్రిణాళ్ శ్రేష్ట, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డీఎఫ్‌వో సిద్ధార్థ విక్రమ్‌సింగ్ పాల్గొన్నారు.