Khammam | భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 15 : సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. శనివారం బంజారా వైద్యారోగ్య శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఇల్లందు క్రాస్ రోడ్లో గల కార్తీక వనంలో ఏర్పాటు చేసిన సంత్ సేవాలాల్ మహారాజ్ 286 వ జయంతి ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా కలెక్టర్‌ను బంజారా సాంప్రదాయం ప్రకారం బంజారా ఉద్యోగులు తలపాగా చుట్టి ఎద్దుల బండిపై వేదిక వద్దకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ సంపత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జ్యోతి ప్రజ్వలన చేసి, భోగ్ బండారొ, వింతి కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. సంత్ సేవాలాల్ తన బోధనల ద్వారా బంజారా జాతి అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. తండాల నిర్మాణానికి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. హింస, మత్తు, ధూమపానాలకు దూరంగా ఉండాలని హితువు పలికి యావత్ ప్రజానీకానికి ఆదర్శంగా నిలిచారని, బంజారా జాతిని చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చిన ఒక విప్లవ చైతన్య మూర్తి అని, దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్త, సమాజ శ్రేయస్సు కోసం సంత్ సేవాలాల్ మహారాజ్ చూపించిన మార్గం అందరికీ ఆదర్శనీయమన్నారు. సేవాలాల్ మహారాజ్ తన బోధనల వల్ల బంజారా జాతి పురోగమించడానికి కృషి చేశారని పేర్కొన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో మనమందరం పయనించి ఆయన ఆశయాలను కొనసాగించాలని కలెక్టర్ కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖ అధికారి భాస్కర్ నాయక్, డిసిహెచ్ఎస్ రవిబాబు, జిజిహెచ్ఆర్ఎంఓ రమేష్ , బంజారా వైద్యులు , వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు .