మామిళ్లగూడెం, మే 18 : నిర్దేశిత గడువులోగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. మధిర నియోజకవర్గంలో చేపడుతున్న, కొనసాగుతున్న అభివృద్ధి పనులపై అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డిలతో కలిసి ఖమ్మం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చింతకాని మండలంలో సాచ్యురేషన్ మోడ్లో లబ్ధిదారులకు మంజూరైన దళితబంధు యూనిట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు.
గ్రౌండింగ్ పూర్తయిన యూనిట్లు, సిక్ అయిన యూనిట్లు, విజయవంతంగా నడుస్తున్న యూనిట్లు, డైవర్ట్ అయిన యూనిట్లపై పూర్తిస్థాయి నివేదిక అందించాలని ఆదేశించారు. అలాగే, జమలాపురం పర్యాటక అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులు మంజూరై టెండర్లు పూర్తయినందున ఆగస్టు 31 వరకు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. బ్యాంకు లింకేజీ లక్ష్యాలను ఎస్హెచ్జీలు తప్పనిసరిగా చేరుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నెలా కొత్త రుణాలకు అర్హత పొందే సంఘాల అంచనాలు సిద్ధం చేయాలని, నెల వారీ లక్ష్యాలను నిర్ణయించాలని సూచించారు. రామకృష్ణాపురంలో చేపడుతున్న పనులను, టీజీఐఐసీ పరిధిలో 84.17 ఎకరాల్లో చిన్న తరహా పరిశ్రమల కోసం అభివృద్ధి చేస్తున్న 264 ప్లాట్ల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
మధర మున్సిపాలిటీలో చేపడుతున్న అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. బోనకల్లు, ఎర్రుపాలెం, మధిర సమగ్ర మండల కార్యాలయాల నిర్మాణాన్ని సరైన ప్రణాళికతో చేపట్టాలని సూచించారు. రూ.14 కోట్లతో వైరా రిజర్వాయర్ పనులను చేపడుతున్నందున 15 రోజుల్లోగా వాటి డిజైన్లను ఖారారు చేయాలని ఆదేశించారు. తల్లాడ వ్యవసాయ మార్కెట్కు 10 ఎకరాల భూమి అవసరమైనందున అదనంగా లక్ష మెట్రిక్ టన్నుల గోదాము సామర్థ్యానికి ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. సమావేశంలో ఆర్డీవో శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.