Shatrughan Sinha | బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ అంశంపై ఆమె తండ్రి, ప్రముఖ నటుడు-రాజకీయ నాయకుడు శత్రుఘ్న సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన కూతురిపై వస్తున్న ఆన్లైన్ దాడి పూర్తిగా ఆర్గానిక్ కాదని, దీని వెనుక భారతీయ జనతా పార్టీ (BJP) ఐటీ సెల్ హస్తం ఉందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. సోషల్ మీడియాలో సోనాక్షిని టార్గెట్ చేస్తున్నవారు చాలామంది పెయిడ్ ట్రోలర్స్ అని, వారు మాట్లాడుతున్న విషయాలపై కనీస అవగాహన కూడా ఉండదని ఆయన విమర్శించారు.
జార్ఖండ్‌లో ఇటీవల జరిగిన విద్యార్థి ఉద్యమాల సమయంలో సోనాక్షి స్పందించలేదంటూ కొందరు ప్రశ్నలు లేవనెత్తిన సంగతి తెలిసిందే. అయితే, జార్ఖండ్ పిల్లల కోసం సోనాక్షి చాలా బలంగా తన మద్దతును తెలిపిందని శత్రుఘ్న సిన్హా స్పష్టం చేశారు. ఈ ట్రోలింగ్‌ను సోనాక్షి పెద్దగా పట్టించుకోవడం లేదని, తన జీవితంలో ఇతర ముఖ్యమైన విషయాలపై దృష్టి పెడుతుందని ఆయన తెలిపారు. గతంలోనూ పలు సామాజిక, రాజకీయ అంశాలపై సోనాక్షి గళం విప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే, ఆమె భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా లేదా అనే దానిపై స్పష్టతనిస్తూ.. తాను ఈ విషయంపై ముందైతే అడిగేవాడినని, ప్రస్తుతం ఆమె స్వయంశక్తితో ఎదిగిన సమర్థురాలైన కుమార్తె అని శత్రుఘ్న సిన్హా ప్రశంసించారు. సినిమాల విషయానికి వస్తే, సోనాక్షి చివరిసారిగా ఓటీటీలో లీగల్ డ్రామా ‘సిస్టమ్’ చిత్రంలో లాయర్‌గా కనిపించారు. త్వరలోనే ఆమె ‘దహాడ్ సీజన్ 2’ చిత్రంలో నటించనున్నారు.