ఖమ్మం/ ఖమ్మం సిటీ, అక్టోబర్ 10: ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ సూచించారు. పీహెచ్‌సీల్లో పనిచేసే సిబ్బంది అటెండెన్స్‌ను వంద శాతం ఆన్లైన్ చేసి మానిటరింగ్ చేయాలని సూచించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులతో కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రసవ సమయంలో తల్లి మరణాలకు సంబంధించి కేసులు పరిశీలిస్తే రెండో ఏఎన్సీ చెక్ అప్ ప్రైవేట్ ఆసుపత్రిలో చేసుకున్నట్లు తేలిందని, దీనికి గల కారణాలను ఏంటని అన్నారు. గర్భిణులకు చికిత్స అందించడంలో నిర్లక్ష్యం వహించిన ప్రైవేట్ ఆసుపత్రులపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఆశా కార్యకర్తలు రెగ్యులర్‌గా తమ పరిధిలో ఇంటింటి సర్వే చేస్తూ గర్భిణుల ఏఎన్సీ రిజిస్ట్రేషన్‌ను వంద శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధికంగా ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వీలైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని, సీ సెక్షన్ డెలివరీలను నివారించాలని అన్నారు. అలాగే, అన్ని పీహెచ్‌సీల్లో డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా తదితర వాధ్యుల వ్యాధి నిర్ధారణ కిట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. నిరుటి కంటే ఈ ఏడాది డెంగ్యూ కేసులు 58 శాతం తగ్గినట్లు చెప్పారు. పారిశుధ్య సమస్యల వల్ల కేసులు అధికంగా నమోదవుతున్న గ్రామాల జాబితాను అందించాలని ఆదేశించారు. అనంతరం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కలెక్టర్, ఇతర అధికారులు ప్రతిజ్ఞ చేశారు. డీఎంహెచ్‌వో డాక్టర్ కళావతిబాయి, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.