మధిర, సెప్టెంబర్ 4: స్వయం ఉపాధి కోసం ఇందిరా మహిళా డెయిరీ సభ్యులకు అందించే పాడి పశువుల కొనుగోళ్లలో పారదర్శకత పాటించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. మధిర మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఇందిరా మహిళా డెయిరీ పాడి పశువుల కొనుగోలు టీం సభ్యులకు కలెక్టర్.. అదనపు కలెక్టర్ శ్రీజ గురువారం అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 20 వేల మంది లబ్ధిదారులకు 2 పశువుల చొప్పున, 40 వేల పాడి పశువులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పశువుల కొనుగోలు కోసం 10 బృందాలు ఏర్పాటు చేశామని, ప్రతీ బృందంలో 6 మంది సభ్యులు ఉంటారన్నారు. పశువుల కొనుగోలులో ఎలాంటి తప్పులు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. పాడి పశువుల కొనుగోలులో లబ్ధిదారుల భాగస్వామ్యం కూడా ఉండాలన్నారు.
పశువుల కొనుగోలుకు సంబంధించి డాక్యుమెంటేషన్ పక్కాగా ఉండాలని, ప్రతీ పశువుకు తప్పనిసరిగా బీమా చేయించాలన్నారు. పాడి పశువుల ఆరోగ్యాన్ని వెటర్నరీ అధికారులు పక్కాగా పర్యవేక్షించాలని, వాటికి అవసరమైన ఆహారం ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. పశువులకు ట్యాగ్ తప్పనిసరిగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రీసైక్లింగ్‌కు ఆస్కారం ఉండొద్దన్నారు.
పశువులు లబ్ధిదారులకు అందించిన తర్వాత జిల్లాలో ర్యాండమ్‌గా తనిఖీలు నిర్వహించి రిపోర్టు తెప్పించుకుంటానని, ఎలాంటి పొరపాట్లు జరిగినా కఠిన చర్యలు తప్పవన్నారు. పాడి పశువులు గ్రౌండింగ్ చేసిన తర్వాత యూసీ, ఫొటో సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీవో ఎన్.సన్యాసయ్య, ఎస్సీ కార్పొరేషన్ డీఈ నవీన్‌బాబు, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ విజయలక్ష్మి, తహసీల్దార్ రాంబాబు, మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.