మామిళ్లగూడెం, జనవరి 23: భారత ప్రజాస్వామ్యంలో బాధ్యతగల పౌరులుగా ప్రతి ఒక్కరూ దేశ అభ్యున్నతిలో భాగం కావాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఆకాంక్షించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులతో కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత సంవత్సరం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జనవరి 23న అధికారులతో ప్రతిజ్ఞ చేయిస్తున్నట్లు తెలిపారు.
మన దేశంలో కులం, మతం, ప్రాంతం, వర్గం, భాష, పేదలు, ధనికులు అనే అంతరం లేకుండా రాజ్యాంగం మన అందరికీ సమానంగా ఓటు హక్కు కల్పించినట్లు వివరించారు. ఈ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ ఏడాది ‘నా భారతదేశం – నా ఓటు’ అనే థీమ్‌తో జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా అధికారులు, ఉద్యోగులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.