జై బోలో గణేశ్ మహరాజ్ కీ జై.. గణపతిబప్పా మోరియా.. అంటూ భక్తకోటి గణనాథుడికి భక్తిప్రపత్తులతో వీడ్కోలు పలికారు. ఉత్సవ మండపాలు, భారీ సెట్టింగులు, చలువ పందిళ్లలో తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు చేసి వెళ్లి రావయ్యా.. మళ్లీ రావయ్యా అంటూ విఘ్నేశ్వరుడిని తల్లి గంగమ్మ ఒడికి చేర్చారు. భక్తబృందాల కేరింతలు, మేళతాళాలు, డప్పు నృత్యాలు, పటాకుల మోతలు, విచిత్ర వేషధారణలు, పుష్పజల్లులు, కోలాటాలు, భజనలు, కీర్తనల మధ్య గణపతి నిమజ్జనోత్సవం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సోమవారం అట్టహాసంగా జరిగింది. సంప్రదాయ వస్త్రధారణలతో యువకులు నృత్యాలు చేస్తూ రంగులు చల్లుకుంటూ, కేరింతలు కొడుతూ తమ ఇష్టదైవాన్ని నిమజ్జనం చేశారు.
– ఖమ్మం, సెప్టెంబర్ 16
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఈ నెల 7న వినాయక చవితి రోజున వేలాది మండపాల్లో కొలువుదీరిన గణపయ్య తొమ్మిది రోజులపాటు భక్తుల విశేష పూజలందుకున్నాడు. సోమవారం గణనాథుల విగ్రహాలను భక్తకోటి సమీప జలాశయాల్లో ఘనంగా నిమజ్జనం చేశారు. గణనాథుడి విగ్రహాలను మున్నేరు, పాలేరు రిజర్వాయర్, ఆకేరు, చెరువులు, వాగులు, కుంటల్లో నిమజ్జనం చేశారు.
సంప్రదాయ వస్త్రధారణలతో నృత్యాలు.. విచిత్ర వేషధారణలు.. డప్పు నృత్యాల కోలాహలంతో భక్తగణం గణనాథుడిని అనుసరించగా నిమజ్జన శోభాయాత్ర కనులపండువగా సాగింది. రకరకాల ఆకృతులలో గల భారీ, చిన్న వినాయక విగ్రహాలను ట్రాక్టర్లు, వ్యాన్లు, లారీలు తదితర వాహనాలపై ఖమ్మం నగరంలోని పలురూట్ల నుంచి గాంధీచౌక్ ప్రత్యేక వేదిక వద్దకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి శోభాయాత్రగా మున్నేరు బ్రిడ్జి వరకు తీసుకెళ్లారు. గణేశ్ శోభాయాత్ర వాహనాలు నడుపుతున్న డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసులు బ్రీత్ ఎనలైజర్ ద్వారా డ్రంకెన్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు.
ఖమ్మం గాంధీచౌక్ వద్ద గణేశ్ శోభాయాత్రను కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్‌దత్‌తో కలిసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ వినాయకుడి నిమజ్జనం సజావుగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. మేయర్ నీరజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్, ఏడీసీపీ ప్రసాదరావు, ఆర్డీవో గణేశ్, ఉత్సవ కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రం ఖమ్మంలో సుమారు 800 విగ్రహాలను మున్నేరులో నిమజ్జనం చేశారు. కాల్వొడ్డు బ్రిడ్జి, ప్రకాశ్‌నగర్ వద్ద క్రేన్ల సాయంతో విగ్రహాలను నిమజ్జనం చేశారు. బ్రిడ్జికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో అధిక సంఖ్యలో ప్రజలు నిమజ్జనోత్సవాన్ని తిలకించారు.
బూర్గంపహాడ్ (భద్రాచలం), సెప్టెంబర్ 16 : భద్రాచలం వద్ద గోదావరి నదిలో వినాయక విగ్రహాలను ఘనంగా నిమజ్జనం చేశారు. భద్రాద్రి జిల్లాతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భద్రాచలం చేరుకున్న భక్తులతో గౌతమీతీరం సందడిగా మారింది. యువత కేరింతలు, మహిళల కోలాటాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గణనాథులను ఆటోలు, ట్రాలీలు, ట్రాక్టర్లు, లారీలపై నిమజ్జనానికి తీసుకురాగా గోదావరి తీరంలో అధికారులు ఏర్పాటు చేసిన సహాయక సిబ్బంది విగ్రహాలను క్రేన్ ద్వారా లాంచీలోకి ఎక్కించి నది మధ్యలో నిమజ్జనం చేశారు. గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీంలను అధికారులు అందుబాటులో ఉంచారు. సోమవారం 530 విగ్రహాలు నిమజ్జనానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు.