
దళిత బంధు పథకంతో దళితుల కుటుంబాల్లో వెలుగులు
రైతులను ఆదుకునేందుకే రుణమాఫీ
గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్లు
అర్హులందరికీ కొత్త రేషన్‌కార్డులు
కరోనా కట్టడిలో ప్రభుత్వం సఫలం
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
ఖమ్మంలో స్వాతంత్య్ర దిన వేడుకలు
అలరించిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు
అన్నివర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం
‘ఆయిల్ పాం’కు సర్కార్ ప్రోత్సాహకాలు
సీతమ్మసాగర్, సీతారామ ప్రాజెక్టులతో జిల్లా సస్యశ్యామలం
ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
సంక్షేమం, అభివృద్ధిని తెలంగాణ ప్రభుత్వం రెండు కళ్లుగా భావిస్తుందని, అన్ని వర్గాల సంక్షేమమే సర్కార్ ధ్యేయమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆదివారం నిర్వహించిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్‌తో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ పథకాలతో రైతులకు మేలు జరుగుతున్నదన్నారు. పల్లె, పట్టణ ప్రగతితో పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధజలం అందుతున్నదన్నారు. సీతారామ ఎత్తిపోతల పథకం పూర్తయితే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. వేడుకల్లో జడ్పీ చైర్మన్ లింగాల, ఎమ్మెల్సీ బాలసాని, సుడా చైర్మన్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
ఖమ్మం, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణది సంక్షేమ రాజ్యమని, పథకాల అమలులో ఖమ్మం జిల్లా అగ్రభాగాన ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు చెప్పారు. 75వ స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా ఆదివారం ఖమ్మంలోని పోలీసు పరేడ్ మైదానంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసు వందనాన్ని స్వీకరించారు. తరువాత జిల్లా అభివృద్ధిపై మంత్రి ప్రసంగించారు. కరోనాను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను జిల్లాలో పూర్తిస్థాయిలో అమలు చేశామన్నారు. అందువల్ల వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో విజయవంతమయ్యామన్నారు. జిల్లా ఆస్పత్రిలో 320 బెడ్లతో ఐసొలేషన్‌ను ఏర్పాటు చేసి 25,157 మంది రోగులకు వైద్యసేవలు అందించామన్నారు. 3,66,420 మందికి మొదటి డోస్, 98,676 మందికి రెండో డోస్ వ్యాక్సిన్ అందించినట్లు చెప్పారు. ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్ కేంద్రం ద్వారా 56 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నామన్నారు. 3,01,254 మంది రైతులకు రైతుబంధు పథకం ద్వారా రూ.354.57 కోట్ల పంటల పెట్టుబడి సాయాన్ని అందించామన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామాలు, పట్టణాలు మెరుగు పడ్డాయన్నారు. మిషన్ భగీరథ ద్వారా 959 గ్రామాలకు మంచినీటి సరఫరా జరుగుతోందన్నారు. నూతనంగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ నెలకొల్పేందుకు రఘునాథపాలెం, కోయచెలక, చింతగుర్తి ప్రాంతాల్లో 157 ఎకరాల స్థలాన్ని గుర్తించినట్లు వివరించారు.
సంక్షేమంలో ఖమ్మం జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని మంత్రి అజయ్ పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం కింద 93.38 కోట్లతో 49.44 లక్షల పని దినాలను కల్పించామని, 1,57,953 మందికి రూ.138.28 కోట్ల పింఛన్ చెల్లిస్తున్నామని అన్నారు. దళిత బంధు ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాల ద్వారా 30,720 మందికి రూ. 277 కోట్లు అందించినట్లు చెప్పారు. గొర్రెల యూనిట్ల ద్వారా గొల్ల, కురుమలను ఆదుకుంటున్నామని, 12,111 మందికి కొత్త రేషన్ కార్డులు అందించామని అన్నారు.
నగర ప్రజలకు మౌలిక వసతుల కల్పన కోసం అత్యధిక ప్రాధాన్యమిచ్చామని, తెలంగాణలో ఖమ్మం నగరానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చామని మంత్రి అజయ్ గుర్తుచేశారు. రోడ్ల విస్తరణ, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, జంక్షన్లు, గ్రీనరీ ఏర్పాటు వంటి పనులు చేపట్టామన్నారు. బల్లేపల్లిలో అత్యాధునిక వైకుంఠధామాన్ని, కాల్వొడ్డు వైకుంఠధామాన్ని నిర్మించామన్నారు. రూ.70 కోట్లతో చేపట్టిన గోళ్లపాడు చానెల్ ఆధునీకరణ పనులు ముగింపు దశలో ఉన్నాయని, రూ.14 కోట్లతో చేపట్టిన మున్సిపల్ కార్పొరేషన్ నూతన భవనాన్ని దసరా రోజున ప్రారంభించనున్నామన్నారు. ఖమ్మం కల్టెక్టర్ గౌతమ్, సీపీ విష్ణు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, టీఎస్ సీడ్స్ చైర్మన్ కొండబాల కోటేశ్వరావు, మేయర్ నీరజ, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, మధుసూదన్‌రావు, కేఎంసీ కమిషనర్ అనురాగ్ జయంతి, శిక్షణ కలెక్టర్ రాహుల్, డీసీపీ ఇంజారపు పూజ, జిల్లా అధికారులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఖమ్మం, ఆగస్టు 15: వివిధ పథకాల లబ్ధిదారులకు సుమారు రూ.2.64 కోట్ల విలువైన రుణాలు, ఆర్థిక సాయాల చెక్కును లబ్ధిదారులకు మంత్రి అజయ్ అందజేశారు. 33,576 మంది రైతులకు రుణమాఫీ కింద రూ.106.88 కోట్లు, బ్యాంకు లింకేజీ కింద రూ.1.88 కోట్లు, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (పీఎంఎఫ్ఎంఈ) కింద 142 మంది సభ్యులకు రూ.56.57 లక్షల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్, డీఆర్డీవో విద్యాచందన, డీఏవో విజయనిర్మల పాల్గొన్నారు.
ఖమ్మం, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఖమ్మం రూరల్ మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులు వందేమాతరం నృత్య ప్రదర్శన చేశారు. ఖమ్మం బాలలసదన్, జ్యోతి బాలమందిర్ ఉన్నత పాఠశాల, హార్వెస్టు పాఠశాల, ప్రభుత్వ మహిళ కళాశాలల విద్యార్థులు దేశభక్తి గీతాలపై ప్రదర్శించిన నృత్యాలు మంత్రముగ్ధులను చేశాయి. మీనా నృత్యాలయ చిన్నారులు శాస్త్రీయ నృత్యాన్ని ప్రదర్శించారు.