ఖమ్మం, జనవరి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాసంగి రైతుబంధు పంపిణీ ప్రక్రియ కొనసాగుతున్నది. గత నెల 28వ తేదీ నుంచి సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి జమ చేస్తున్నారు. దీంతో ఖమ్మం జిల్లావ్యాప్తంగా సాగు పనులు జోరందుకున్నాయి. గడిచిన ఐదు రోజుల నుంచి జిల్లావ్యాప్తంగా ఈ ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. ఈ ఏడాది యాసంగి సీజన్‌కు సుమారు 3,28,491లక్షల మంది రైతులకు, 363.44 కోట్ల రూపాయలను కేవలం పక్షం రోజుల వ్యవధిలోనే అన్నదాతలకు అందజేసేందకు సర్కార్ నిర్ణయం తీసుకున్నది. అందుకు అనుగుణంగానే చిన్న,సన్నాకారు రైతులకు ప్రాధాన్య క్రమంలో సొమ్ము జమ చేస్తున్నారు. తొలిరోజు ఎకరంలోపు భూమి కలిగిన 1,14,000 రైతులకు రూ.34 కోట్లు, రెండోరోజు1నుంచి 2 ఎకరాలు కలిగిన 78,500 మంది రైతులకు రూ 58కోట్లు, మూడోరోజు 2 నుంచి 3 ఎకరాలు కలిగిన 43,700 మంది రైతులకు రూ.55 కోట్లు, నాల్గోరోజు 3నుంచి 4 ఎకరాలు కలిగిన 24,500 మంది రైతులకు రూ.45.50 కోట్లు పంపిణీ చేశారు.
పంటల పెట్టుబడికి సంబంధించి ప్రభుత్వం ఉచితంగానే పెట్టుబడి సాయం రైతుల అకౌంట్లలో జమ చేస్తున్నది. దీంతో మూడు రోజుల నుంచి రైతులు సాగు పనులు ముమ్మరం చేశారు. జిల్లా వ్యవసాయ శాఖ గణంకాల ప్రకారం.. జిల్లా వ్యాప్తంగా 67,142 ఎకరాల్లో వివిధ రకాల పంట సాగు జరిగింది. వరి 12,604 ఎకరాల్లో వరినాట్లు వేసుకున్నారు. కంది పంటకు సంబంధించి 245 ఎకరాలు, యాసంగి పత్తి 78.38 ఎకరాలు, మక్కసాగు 53,189 ఎకరాలు, మిర్చి 309 ఎకరాలు, పెసర 244 ఎకరాలు, వేరుశనగ 379 ఎకరాల్లో సాగు చేశారు. వీటితోపాటు మినుము, చెరకు పంటల సాగు ప్రారంభమైంది. ఈ నెల చివరి వరకు యాసంగి సాగు పనులు పూర్తి కావొచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
తెలంగాణ ఏర్పడక ముందు వ్యవసాయం చేసేందుకు పుస్తెలు తాకట్టు పెట్టేవాడిని. గతంలో విత్తనాలు కొనాలన్నా, ఎరువులు తెచ్చుకోవాలన్నా బయట అప్పు తెచ్చుకునేవాడిని. చివరికి దుక్కి దున్నేందుకు ట్రాక్టర్ కిరాయిని కూడా పంట చేతికొచ్చాక వడ్డీతో సహా కట్టేవాడిని. తెలంగాణ ఏర్పడిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ వచ్చాక ఈ పరిస్థితులన్నీ మారిపోయాయి. ఆయన వచ్చిన కొన్నేళ్లకే రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చారు. నాకున్న 2.16 ఎకరాల వ్యవసాయ భూమికి గాను ఏటా సుమారు రూ.25 వేల వరకూ రైతుబంధు పంటల పెట్టుబడి సాయం అందుతోంది. దీంతో రెండు పంటలకూ పెట్టుబడికి తిప్పలు తప్పాయి.
-దురిశెట్టి వెంకటయ్య, రైతు, సోమవరం గ్రామం
రైతుల కష్టాలు తెలిసిన హలదారుడు కేసీఆర్. నాకున్న 3.20 ఎకరాలకు గాను రైతుబంధు కింద సుమారు రూ.36 వేల పంటల పెట్టుబడి సాయం అందుతోంది. రెండు పంటల్లోనూ వరిని సాగుచేస్తున్నాను. తెలంగాణ రాక ముందు ఇదే పొలాన్ని సాగు చేసేందుకు అష్టకష్టాలూ పడేవాణ్ని. తెలంగాణ వచ్చాక, సీఎం కేసీఆర్ రైతుబంధు అమలు చేస్తున్నాక నా కష్టాలన్నీ తీరిపోయాయి. సమయానికి రైతుబంధు అందుతోంది. దీంతో రంది లేకుండా పొలం పనుల్లో నిమగ్నమవుతున్నా. రైతులందరూ ఇలాగే చేస్తున్నారు. గతంలో వ్యవసాయ రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి విసిగి వేసారిన రైతులందరికీ రైతుబంధు పథకం ఆపద్బంధువు అయింది. ఇప్పుడు రైతుబంధు పంటల పెట్టుబడి సాయం జమ కాగానే గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంటోంది. మొబైల్‌కు మెసేజ్ రాగానే బ్యాంకుకు వెళ్లి తెచ్చుకొని వ్యవసాయానికి ఉపయోగించుకున్నాం.
-దురిశెట్టి కృష్ణమూర్తి, సోమవరం గ్రామం, వైరా మండలం