ఖమ్మం, ఏప్రిల్ 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు ఎందాకైనా వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. వడ్ల పోరుకు సై అంటూ కార్యక్షేత్రంలోకి దిగారు. కేంద్రం అనుసరిస్తున్న మోసపూరిత విధానాలను రైతులకు వివరిస్తూ.. వారి పక్షాన నిలుస్తూ ఉద్యమాలను ఉధృతం చేస్తున్నారు. వడ్లు కొనేవరకూ వెనుకడుగు వేయబోమని ప్రతినబూనారు. ఇందులో భాగంగా రేపు (గురువారం) ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన దీక్షలు చేపట్టనున్నారు. ఈ మేరకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రెండు జిల్లాల టీఆర్ఎస్ అధ్యక్షులు సైతం ముఖ్యనేతలతో సమావేశమై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. కేంద్రంపై సమరభేరి మోగించేందుకు గులాబీ నేతలు, రైతులు సిద్ధంగా ఉండాలని సూచించారు.
యాసంగిలో రాష్ట్ర రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసేలా ఒత్తిడి తెచ్చేందుకు టీఆర్ఎస్ దశల వారీగా ఉద్యమిస్తున్నది. దీనిలో భాగంగా సోమవారం మండల కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు దీక్షలు నిర్వహించారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాకేంద్రాల్లోనూ మహాధర్నాలు జరుగనున్నాయి. రాష్ట్ర రవాణాశాఖామంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఇప్పటికే దీక్షలను విజయంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాకేంద్రాల్లో దీక్షలు చేపట్టేందుకు ఉభయ జిల్లాల పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు, తాతా మధు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు. దీక్షలకు పెద్ద ఎత్తున నాయకులు, రైతులను సమీకరించేందుకు కృషి చేస్తున్నారు.
మంగళవారం ఖమ్మంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధు వివిధ మండలాల పార్టీ నేతలతో సమావేశమయ్యారు. సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. దీక్షలకు ప్రతి గ్రామం నుంచి రైతులు, పార్టీ నాయకులను సమీకరించాలని సూచించారు. మోదీదీ ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయాన్ని దీక్షలో ఎండగట్టాలన్నారు. సమావేశానికి పాలేరు, ఖమ్మం, వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లోని ఆయా మండలాల టీఆర్ఎస్ ముఖ్యనేతలు హాజరయ్యారు.
కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, మేయర్ పునుకొల్లు నీరజ, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు పాల్గొన్నారు. మరోవైపు భద్రాద్రి జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. శ్రేణులు, రైతులను సమీకరించేలా కృషి చేస్తున్నారు.
11న ఢిల్లీలో సీఎం కేసీఆర్ దీక్ష
ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ దీక్షలకు కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే ఈనెల 11న సీఎం కేసీఆర్ ఢిల్లీలో దీక్ష చేపట్టనున్నారు. దీక్షకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రైతుబంధు సమితి సభ్యులు, ప్రజాప్రతనిధులు, పార్టీ నేతలు హాజరుకానున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వేలాది మంది దీక్షకు తరలివెళ్లనున్నారు. రైతుల మద్దతు కూడగట్టనున్నారు.
నగరంలోని ధర్నాచౌక్ పరిశీలన..
ఖమ్మం నగరంలోని ధర్నాచౌక్‌లో గురువారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహా ధర్నా జరుగనున్నది. మంత్రి అజయ్‌కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి ధర్నాచౌక్‌ను ఎమ్మెల్సీ తాతా మధు, మేయర్ నీరజ, సుడా చైర్మన్ విజయ్‌కుమార్, పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, మంత్రి వ్యక్తిగత సహాయకుడు కిరణ్‌కుమార్ పరిశీలించారు. దీక్షకు ఏర్పాట్లు పక్కాగా ఉండాలని శేణులను ఆదేశించారు.