ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ రఘునాథపాలెం, జనవరి 18: ఖమ్మంలో ఆధునిక హంగులతో నిర్మించిన సమీకృత కలెక్టర్ కార్యాలయ సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా, కాంగ్రెస్ శాసనసభా పక్షనేత మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్, నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి, తాతా మధుసూదన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ తదితరులు హాజరయ్యారు.
వారి సమక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్ కార్యాలయాన్ని వేదమంత్రోచ్ఛారణల మధ్య మంగళవాయిద్యాలతో ప్రారంభించారు. సీఎం కేసీఆర్ తొలుత కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం రాష్ట్ర మంత్రులను, అధికారులను అతిథులకు స్వయంగా పరిచయం చేశారు. కలెక్టర్ కార్యాలయం ప్రారంభించిన వెంటనే ముఖ్యమంత్రి, ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు, అతిథులు ఈ కార్యాలయంలోని కలెక్టర్ చాంబర్‌ను ప్రారంభించారు. కలెక్టర్ వీపీ గౌతమ్‌ను సీఎం కేసీఆర్ స్వయంగా కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఇతర అతిథులూ విషెస్ చెప్పారు.
సమీకృత కలెక్టర్ కార్యాలయ నిర్మాణం, ఇందులోని ప్రభుత్వ శాఖలు, ప్రజలకు అందుబాటులో పరిపాలన విభాగం అంతా ఒకేచోట ఉండటం వల్ల ప్రయోజనం వంటి అంశాలను కలెక్టర్ వీపీ గౌతమ్ ముఖ్య అతిథులకు వివరించారు. 46 ప్రభుత్వ శాఖలు ఒకేచోట ఉంటాయని, దరఖాస్తుదారులు కలెక్టర్ కార్యాలయానికి ఏ పనిమీద వచ్చినా సత్వరం ఆయా శాఖల అధికారులను కలిసి పని పూర్తిచేసుకునే వెసులుబాటు లభిస్తుందని విశదీకరించారు. కలెక్టర్ చాంబర్ ప్రారంభోత్సవంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ తదితరులు కూడా జిల్లా కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
కలెక్టరేట్లో అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు సందర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్ కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణానికి సంబంధించి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యాలయ నిర్మాణం అద్భుతంగా ఉందని అఖిలేశ్‌యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కితాబునిచ్చారు.
సర్వమత ప్రార్థనలు..
ఖమ్మం శివారు వీ వెంకటాయపాలెం వద్ద 22 ఎకరాల సువిశాల ప్రాంగణంలో రూ.55.24 కోట్లతో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించే సమయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ముందుగా రెండు హెలీకాప్టర్లలో కలెక్టరేట్ ప్రాంగణంలోని హెలీప్యాడ్‌లో దిగిన ముఖ్య అతిథులు ప్రత్యేక వాహనంలో కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అనంతరం సమీకృత కలెక్టరేట్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తదుపరి ముఖ్య అతిథులతో నేరుగా కలెక్టర్ చాంబర్‌ను సందర్శించిన సీఎం కేసీఆర్.. అక్కడ వేదపండితులతో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అక్కడే సర్వమత ప్రార్థనల్లోనూ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ వీపీ గౌతమ్‌ను ఆయన చాంబర్‌లోని సీటులో కూర్చోబెట్టారు.
కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ముఖ్య అతిథులు, వామపక్ష పార్టీల జాతీయ నేతలతో కలిసి తిలకించారు. పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సులభతరమైన సేవలందించాలనే ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నూతనంగా కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టిన విషయాన్ని సీఎం కేసీఆర్.. ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులకు తెలియజేశారు. ఇప్పటికే పలు జిల్లాల్లో కార్యాలయాలు అందుబాటులో ఉంచామని, మరికొన్ని పూర్తయ్యే దశలో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు బానోత్ చంద్రావతి, బానోత్ మదన్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.
అన్ని సౌకర్యాలతో బాగుంది
సకల సౌకర్యాలతో నిర్మించిన నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయం బాగుంది. పాత భవనాల్లో విధులు నిర్వహించి అనేక ఇబ్బందులు పడ్డాం. నూతన కార్యాలయంలో సిబ్బంది విధులకు అవసరమైన ప్రత్యేక క్యాబిన్లు కేటాయించారు. ప్రత్యేక కంప్యూటర్లను సైతం ఏర్పాటు చేశారు. సాంకేతిక టెక్నాలజీతో నూతన కార్యాలయాన్ని నిర్మించినందుకు సంతోషంగా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– ఏలూరి శ్రీనివాసరావు, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ
సీఎం కేసీఆర్ ఆలోచన గొప్పది
ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేయడం హర్షణీయం, కార్యాలయాలన్నింటినీ ఒకేచోట నిర్మించిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. గతంలో కార్యాలయానికి వెళ్లాలంటే ఆఫీస్ ఎక్కడుందో వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు కలెక్టర్ కార్యాలయానికి వస్తే సరిపోతుంది. ఏ సమస్యపై ఫిర్యాదు చేయాలన్నా.. సదరు అధికారిని కలిసి విన్నవించుకోవచ్చు. జిల్లా ప్రజలందరూ కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– ధరావత్ నాగేశ్వరరావు, వీ వెంకటాయపాలెం
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం
మా ఊర్లో సమీకృత కలెక్టర్ కార్యాలయాన్ని నిర్మించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గ్రామస్తులంతా జీవితాంతం రుణపడి ఉంటాం. మా గ్రామంలో నూతన సమీకృత కలెక్టరేట్ కడతారని ఎన్నడూ అనుకోలేదు. సమీకృత కలెక్టరేట్ నిర్మాణంతో మా గ్రామంలో భూములకు ధరలు విపరీతంగా పెరిగాయి. మా గ్రామ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.
– బానోత్ నాగమణి, వీ వెంకటాయపాలెం