మధిర, ఏప్రిల్ 14 : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే కేసీఆర్ కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమలరాజు అన్నారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి, విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… రాజ్యాంగంలో పొందిపరిచిన అంశాలకు అనుగుణంగా ఈ రాష్ట్రం సాధించుకోవడానికి అవకాశం కలిగిందన్నారు. హైదరాబాద్లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఆ విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఒక్కసారి కూడా పూలమాలవేసి గౌరవించింది లేదన్నారు. దళితుల అభివృద్ధి కోసం మాజీ సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం తెస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కుటుంబానికి రూ.12 లక్షలు ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా దళితులకు అందించలేదని విమర్శించారు.
కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో 10 శాతం లబ్ధిదారులకు రావాల్సిన డబ్బులను కూడా ఇంకా ఈ ప్రభుత్వం ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం పాటుపడాలని, దళిత కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం అధ్యక్షుడు విక్కీ కృష్ణ ప్రసాద్, చిత్తారు నాగేశ్వరరావు, బొగ్గుల భాస్కర్ రెడ్డి, అరగ శ్రీనివాసరావు, వంకాయలపాటి నాగేశ్వరరావు, సత్యనారాయణ రెడ్డి, పాల్వవంచ రామారావు, చావా వేణు బాబు, ఉమామహేశ్వర్ రెడ్డి, పరిష శ్రీనివాసరావు, ఆళ్ల నాగబాబు పాల్గొన్నారు.
Madhira : అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారు : లింగాల కమలరాజు