ఖమ్మం, జనవరి 17: కేఎంసీ పాలకవర్గ సమావేశాల్లో ప్రజా సమస్యలపైనా, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపైనా బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోరాడాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పాత్ర సరైన విధంగా పోషిస్తూ నగరాభివృద్ధికి కృషి చేయాలని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎవరి బెదిరింపులకూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా తాను అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. ఖమ్మంలోని మమత ఆసుపత్రి ఆవరణలో గల అజయ్‌కుమార్ క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ల ప్రత్యేక సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఖమ్మం కార్పొరేషన్ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్‌గా సీనియర్ కార్పొరేటర్ కర్నాటి కృష్ణ, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌గా షేక్ మక్బుల్‌ను బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో మాజీ మంత్రి అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. ఉచిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం చెందిందని విమర్శించారు. ఆరు గ్యారెంటీలను అమలుచేయ చేతకాని ప్రభుత్వమని, ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిందని దుయ్యబట్టారు.
కర్నాటి కృష్ణ మాట్లాడుతూ ఖమ్మం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించక ఆరునెలలు దాటిందన్నారు. నగర సమస్యలు పట్టించుకునే నాథుడేలేడని, పారిశుధ్యం, వీధిలైట్లు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి పట్టించుకోవట్లేదని విమర్శించారు. చెత్త సేకరించే ఆటోలు మూలనపడ్డాయని, కార్పొరేటర్లు ప్రొటోకాల్ పట్టించుకోవడం లేదన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, సీనియర్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.