భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కంచర్ల చంద్రశేఖరరావును వరించింది. నాలుగేళ్లుగా జడ్పీ వైస్ చైర్మన్‌గా ఉన్న కంచర్ల శనివారం జడ్పీ కార్యాలయంలో చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలి వరకూ జడ్పీ చైర్మన్‌గా ఉన్న కోరం కనకయ్య ఇల్లెందు ఎమ్మెల్యేగా విజయం సాధించి చైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో వైస్ చైర్మన్‌గా ఉన్న కంచర్ల చంద్రశేఖరరావు ఇన్చార్జి చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. దీంతో జడ్పీ కార్యాలయంలో శనివారం కంచర్లకు జడ్పీ సీఈవో విద్యాలత ప్రొసీడింగ్‌ను అందజేశారు. దీంతో ఆయన కార్యాలయ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ప్రొటోకాల్ ప్రకారం గన్మెన్లతోపాటు క్యాంపు కార్యాలయం కూడా చైర్మన్ ఆధీనంలో ఉండనుంది. కాగా, జడ్పీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన కంచర్ల.. కలెక్టర్ ప్రియాంక మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.
కనకయ్య రాజీనామా ఆమోదంతో..
ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన కోరం కనకయ్య ఇటీవలే తన తన రాజీనామాను కలెక్టర్‌కు సమర్పించారు. కలెక్టర్ అతడి రాజీనామాను ఆమోదించి వైస్ చైర్మన్ కంచర్లకు జడ్పీ చైర్మన్‌గా ప్రొసీడింగ్ ఇచ్చారు. దీంతో టేకులపల్లి జడ్పీటీసీ స్థానం కూడా ఖాళీ అయింది.
1970 నుంచి రాజకీయాల్లో ఉన్నా: కంచర్ల
1970 నుంచే రాజకీయాల్లో ఉన్నానని జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు అన్నారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 1991లో కొత్తగూడెం సొసైటీ చైర్మన్‌గా పనిచేశానని, చాలా పదవుల్లో పనిచేసిన అనుభవం ఉందని అన్నారు. అభివృద్ధిలో జిల్లాను మరింత ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.