పెనుబల్లి, ఏప్రిల్ 20: కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చేంత వరకు ప్రతి కార్యకర్త, అభిమాని కృషి చేయాలని కోరారు. నాయకులను తయారు చేసిన కేంద్రం సత్తుపల్లి నియోజకవర్గమని, ఈ నెల 27న తలపెట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కల్లూరు మండలం లింగాల గ్రామంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దోరేపల్లి పట్టాభిరామ్ గృహప్రవేశానికి ఆదివారం ఆమె హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమెకు గ్రామ శివారున అభిమానులు ఘనస్వాగతం పలుకుతూ గజమాలతో సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అధికారంలోకి రావడానికి అబద్ధాలు ఆడి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని, అకాల వర్షాలు వచ్చి పంటలు నష్టపోతున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. రైతుభరోసా, రుణమాఫీ సగంసగం ఇచ్చిందని, మహిళలకు చేయూత, కల్యాణలక్ష్మికి రాంరాం పకలికిందని, నిరుద్యోగ భృతి, పింఛన్లు పెంపుదలను మరిచిందని విమర్శించారు.
అప్పులు చేస్తేనే ప్రభుత్వం నడిచే పరిస్థితి ఏర్పడిందన్నారు. భూములు అమ్మడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం వంటి పనుల్లో ముఖ్యమంత్రి, మంత్రులు బిజీగా ఉన్నారని విమర్శించారు. అకాల వర్షాలకు పంటలు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల పరిహారం ఇచ్చేంత వరకు రైతుల తరఫున పోరాడుతామని స్పష్టం చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. వరంగల్ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, బీఆర్ఎస్ నేతలు పాలెపు రామారావు, కట్టా అజయ్‌బాబు, బీరవల్లి రఘు, లక్కినేని రఘు పాల్గొన్నారు.