ఖమ్మం లీగల్, మార్చి 8 : లోక్ అదాలత్‌లో ఇరుపక్షాల రాజీ ఎంతో ప్రయోజనకరమని, కక్షిదారులకు మానసిక ప్రశాంతత లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ అన్నారు. శనివారం ఉదయం 10గంటలకు ఖమ్మం కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో ఆయన మాట్లాడారు. ఇరువర్గాల కక్షిదారులు రాజీ పడితే వారికి వారి ఆర్థిక ప్రయోజనాలతోపాటు సమయం ఆదా అవుతుందని, కోపతాపాలకు పోకుండా రాజీ చేసుకోవడం ద్వారా గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుందన్నారు.
కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ వేదిక అని, లోక్ అదాలత్ అవార్డు సుప్రీంకోర్టు అవార్డుతో సమానమని పేర్కొన్నారు. కక్షిదారులు అహం తగ్గించుకొని ఒకరికొకరు సహకరించుకోవడం ద్వారా కేసులు త్వరగా పరిష్కారమవుతాయన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా అదనపు జడ్జి కె.ఉమాదేవి మాట్లాడుతూ మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలని, మహిళల అభివృద్ధి కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమానికి న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కేవీ చంద్రశేఖరరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నేరేళ్ళ శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి చింతనిప్పు వెంకట్, న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
ఖమ్మం, మధిర, సత్తుపల్లి కోర్టుల్లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 13 బెంచీలను ఏర్పాటు చేశారు. క్రిమినల్ కేసులు 643, సివిల్ కేసులు 51, చెక్‌బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద కేసులు 62, నష్టపరిహారంగా రూ.2 కోట్ల 71లక్షల 77 వేలు బాధితులకు అందజేశారు. ట్రాఫిక్ చలానాలు 16,169, బ్యాంకు రికవరీ 18, ఎస్టీసీ, పీఎల్సీ, ఈపీ 2,318 కేసులు, వివా హ సంబంధిత 6 కేసు లు, సైబర్ కేసులు 78 మొత్తం 19,345 కేసులు పరిష్కారమయ్యాయి.
కొత్తగూడెం టౌన్, మార్చి 8 : జాతీయ లోక్ అదాలత్‌లో జిల్లావ్యాప్తంగా 4,997 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా జడ్జి పాటిల్ వసంత్ తెలిపారు. కొత్తగూడెంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్వర న్యాయం కోసం జాతీయ లోక్ అదాలత్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజీ మార్గంలో నడిచే వారే సమాజానికి మార్గదర్శకులని, వారు అభినందనీయులని అన్నారు. క్షణికావేశంలో చేసిన నేరాలతో కోర్టు చుట్టూ తిరిగితే విలువైన కాలం, డబ్బు వృథా అవుతుందని, కక్షిదారులు ఒక్క అడుగు రాజీ మార్గం దిశగా ప్రయత్నం చేస్తే ప్రతివాదులు రెండు అడుగులు తగ్గే అవకాశం ఉందన్నారు. అలాగే కొత్తగూడెంలో సివిల్ కేసులు 11, మోటార్ వాహన ప్రమాద కేసులు, క్రిమినల్ అప్పీల్స్‌కు రూ.3,27,90,000 జరిమానాతో పరిష్కారం లభించిందన్నారు.
క్రిమినల్ 3,174, పీఎల్సీ కేసులు 310 కలిపి మొత్తం 3,495 కేసులు పరిష్కారమయ్యాయన్నారు. ఇల్లెందులో సివిల్ 6, క్రిమినల్ 278, పీఎల్సీ కేసులు 138 కలిపి మొత్తం 422 కేసులు పరిష్కారమైనట్లు తెలిపారు. భద్రాచలంలో క్రిమినల్ 653, పీఎల్సీ కేసులు 104 కలిపి మొత్తం 757 కేసులు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. మణుగూరులో క్రిమినల్ 279, పీఎల్సీ కేసులు 44 మొత్తం కలిపి 323 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. లోక్ అదాలత్ సందర్భంగా కక్షిదారులకు ఎస్బీఐ, యూబీఐ ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్జిలు భానుమతి, బి.రామారావు, సాయిశ్రీ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు తోట మల్లేశ్వరరావు, ఎంఎస్ఆర్ రవిచంద్ర, సాధిక్ పాషా పాల్గొన్నారు.