ఎర్రుపాలెం, మే 23: అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారుపై ప్రజలకు నమ్మకం లేకనే స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని జడ్పీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్‌రాజు అన్నారు. గుంటుపల్లి గోపవరంలో మాజీ సర్పంచ్ కోట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం కోట వెంకటేశ్వర్లు, కొండూరి రామకృష్ణతోపాటు పలువురు బీఆర్ఎస్లో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కమల్‌రాజు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు అలవిగాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను నిలువునా మోసం చేసిందన్నారు. ఇప్పుడిప్పుడే వాస్తవాలు అర్థమవుతున్నాయని, రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీని గద్దె దింపి బీఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
కాంగ్రెస్ నేతలు అబద్ధాలు మానుకొని ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అత్యధిక పంచాయతీలను కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకులు యన్నం శ్రీనివాసరెడ్డి, శీలం కవిత, శ్రీకాంత్‌రెడ్డి, సంక్రాంతి కృష్ణారావు, సాంబశివరావు, మల్లికార్జున్‌రెడ్డి, మందడపు నరేశ్, పెనుగొండ రవి, నాగిరెడ్డి పాల్గొన్నారు.