మధిర( చింతకాని ), మార్చి 17 : ఎస్సీ వర్గీకరణ చేయకుండా ఉద్యోగ నియామకాలు, నోటిఫికేషన్లను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయడం బాధాకరమని ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పగిడిపల్లి రవీంద్ర, చింతకాని మండల అధ్యక్షుడు డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం చింతకాని మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నిరసన దీక్షలో వారు మాట్లాడారు. మాదిగలను రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తూ ఉద్యోగ అవకాశాలను కల్పించకుండా వ్యవహరిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం వర్గీకరణకు సానుకూలంగా సుప్రీంకోర్టు ద్వారా తీర్పు వచ్చినా కూడా ఆర్డినెన్స్ తెచ్చి ఎస్సీ వర్గీకరణ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగ ఫలితాలను విడుదల చేస్తున్న తీరుపై ప్రభుత్వాన్ని త్వరలో ఎండగడతామన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గ్రూప్ -1, గ్రూప్ -2, గ్రూప్ -3 ఫలితాలను విడుదల చేయొద్దని, కొద్దికాలం పాటు వాయిదా వేయాలని కోరినట్లు తెలిపారు. వర్గీకరణ తర్వాతే ఉద్యోగ నియమాకాలు చేపట్టి మాదిగ ఉప కులాలకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం తాసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఎమ్మార్పీఎస్ దీక్షలకు మద్దతుగా బీజేపీ మండల అధ్యక్షుడు కొండా గోపి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ, ఎంఎస్పీ మండల ఉపాధ్యక్షుడు కొమ్ము జానరాజు మాదిగ, చిర్రా ఉపేందర్ మాదిగ, మండల అధికార ప్రతినిధి చాట్ల రాజేష్ మాదిగ, మండల ప్రచార కార్యదర్శి కుక్కల దిలీప్ మాదిగ, డక్కల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు అంతాటి రమేశ్ పాల్గొన్నారు.