భద్రాచలం, జూలై 11: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేసి, పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న సీపీఎస్ జన జాగరణ యాత్ర భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం వద్ద నుంచి శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా నాయకులు, ఉద్యోగులు పోస్టర్లు చేబూని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ యాత్రను సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ ప్రారంభించి, మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి మళ్లీ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించారని గుర్తు చేశారు.
ఎన్నికల హామీ మేరకు రాష్ట్రంలో 2.6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేకూరే విధంగా ముఖ్యమంత్రి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. భద్రాచలంలో ప్రారంభమైన ఈ యాత్ర రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కొనసాగుతుందని పేర్కొన్నారు. అనంతరం ఉద్యోగులందరూ భద్రాద్రి రామాలయం నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావుకు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యను రాష్ట్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీఎస్సీపీఎస్ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్, నాయకులు నాగునాయక్, తుక్కాని శ్రీనివాస్‌రెడ్డి, రాజశేఖర్, సురేశ్, మల్లికార్జున్, వెంకటేశ్, చంద్రకాంత్, మహాదేవ్ తదితరులు పాల్గొన్నారు.