కొత్తగూడెం సింగరేణి, జూన్ 28 : నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 9వ తేదీన కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఒకరోజు దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. కొత్తగూడెంలోని శేషగిరి భవన్లో ఏఐటీయూసీ నుంచి వాసిరెడ్డి సీతారామయ్య, ఐఎన్టీయూసీ నుంచి త్యాగరాజన్, సీఐటీయూ నుంచి రాజిరెడ్డి, టీబీజీకేఎస్ కాపు కృష్ణ శనివారం విలేకరులతో మాట్లాడారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో భవిష్యత్లో కార్మిక సంఘాలు పెట్టుకునే హక్కులు, సమ్మె చేసే హక్కు లేని పరిస్థితి రాబోతుందన్నారు. బార్గెయినింగ్ చేసే అవకాశం కూడా ఇక ముందు ఉండబోదని, దీనికి వ్యతిరేకంగా ఒకరోజు టోకెన్ సమ్మె చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హక్కుల సాధన కోసం పోరాటాలు చేస్తున్నామన్నారు. అవసరమైతే దీర్ఘకాలిక పోరాటాలు చేస్తామని, కార్మికవర్గ చైతన్యం కోసం సమ్మె చేయక తప్పదన్నారు. సమావేశంలో అన్ని సంఘాల బాధ్యులు, నాయకులు పాల్గొన్నారు.