కారేపల్లి, ఏప్రిల్ 23 : ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ హింసాత్మక చర్యలకు భయపడేది లేదని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాత మధు అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధి సింగరేణి మండల కేంద్రంలో బుధవారం స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాత మధు మాట్లాడుతూ..అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రతిపక్ష హోదాలో ప్రజా సమస్యలపై పోరాడుతామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలల కాలంలోనే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఏం జరుగుతుందనేది అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకే అర్థంకాక బోరున విలపిస్తున్నారని ఎద్దేవ చేశారు. కల్యాణలక్ష్మి ఆర్థిక సహాయం, తులం బంగారం, ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.
రాష్ట్ర ప్రజల సమస్యలు పట్టనట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ఢిల్లీకి డబ్బుల మూటలు పంపడానికి హైడ్రా పేరుతో పేద ప్రజల కడుపు కొడుతున్నారని మండిపడ్డారు. లగచర్లలో స్వయాన సీఎం సోదరుడు పేద ప్రజల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుంటే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి అండగా నిలవగా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు చివాట్లు పెట్టిందన్నారు. దీంతో మాజీ సీఎం కేసీఆర్,మాజీ మంత్రి కేటీఆర్,బిఆర్ఎస్ ముఖ్య నాయకులపై రేవంత్ సర్కార్ అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసే యోచనలో ఉందన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పార్టీ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు కేసీఆర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ నియంత పాలనను గద్దెదింపే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు.
ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో పార్టీ తలపెట్టిన భారీ బహిరంగ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి లక్షలాది మంది తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సభకు బయల్దేరేముందు ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జెండాలను ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. అనంతరం అనారోగ్యానికి గురై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వెంకిట్యాతండా బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు భాను భాస్కర్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సమావేశంలో వైరా నియోజకవర్గ మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, మాజీ వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సొసైటీ వైస్ చైర్మన్ ధరావత్ మంగీలాల్, సొసైటీ మాజీ సభ్యుడు ఆడపప్పు పుల్లారావు, బీఆర్ఎస్ బీసీ సెల్ మండల కన్వీనర్ పిల్లి వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు ముత్యాల వెంకట అప్పారావు, బత్తుల శ్రీనివాసరావు, ఉద్యమ, విద్యార్థి సంఘం నాయకుడు జూపల్లి రాము పాల్గొన్నారు.
Karepalli : కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటమే : ఎమ్మెల్సీ తాత మధు