భద్రాచలం, అక్టోబర్ 7 : ఏజెన్సీలోని ఆదివాసీ గ్రామాలు, గూడేల్లో గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నదని భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్ అన్నారు. భద్రాచలంలోని తన చాంబర్లో ఐటీడీఏ పరిధిలోని ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మెడికల్ ఆఫీసర్లతో సోమవారం సాయంత్రం ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలోని గిరిజనులు తమ నివాస ప్రాంతాల నుంచి అరగంటలోనే ఆసుపత్రికి చేరుకోవడానికి పీహెచ్‌సీలు, సబ్సెంటర్లలో వైద్యులు, సిబ్బంది నియామకం, అవసరమైన చోట బైక్ అంబులెన్స్‌ల ద్వారా మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
పీవీటీజీ గిరిజనులకు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. గోదావరి వరద ముంపునకు గురయ్యే గిరిజన గ్రామాలు, రోడ్డు సౌకర్యం లేని గూడేల్లోని గర్భిణులను ప్రసవ వేదనకు ముందే పీహెచ్‌సీలకు తరలించడానికి 108 వెళ్లలేని ప్రాంతాలకు బైక్ అంబులెన్స్ ద్వారా తరలించేలా చూడాలని, అందుకు సంబంధించి కూడా ప్రతిపాదనల్లో పొందుపర్చాలన్నారు. ప్రస్తుతానికి టీహబ్ భద్రాద్రి జిల్లా కేంద్రంలో ఉందని, భద్రాచలంలో మినీ టీహబ్ ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పించినందున అందుకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు.
పీహెచ్‌సీకి దూరంగా సీఎస్సీ ఉండాలని, హెల్త్ హ్యాబిటేషన్ల వారీగా అరగంటలో చేరుకునే విధంగా రహదారి సౌకర్యం ఉండేలా చూడాలన్నారు. ఆర్అండ్బీ, పోలీసు శాఖ సహకారంతో నేషనల్ హైవేల్లో కానీ, మండలాల్లో కానీ, గ్రామాల్లో కానీ ప్రమాదాలు జరిగిన చోట అంబులెన్స్ సౌకర్యం ఉండేలా చూడాలన్నారు. మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది తప్పనిసరిగా సమయ పాలన పాటించాలని, మందుల కొరత అనేది లేకుండా చూసుకోవాలని, సిబ్బంది, ఏఎన్ఎం, ఆశా వర్కర్లపై మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షణ ఉండాలన్నారు. త్వరలోనే ఐటీడీఏ పరిధిలోని గిరిజన గ్రామాల్లో అన్ని రకాల స్పెషలిస్టు వైద్యులతో వైద్య శిబిరాల నిర్వహణకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఎంహెచ్‌వో భాస్కర్‌నాయక్, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ, వైద్యులు చైతన్య, వివిధ సబ్‌సెంటర్లు, పీహెచ్‌సీల వైద్యులు పాల్గొన్నారు.