భద్రాచలం, నవంబర్ 25 : అభివృద్ధి, సంక్షేమ పథకాలు గిరిజనులకు అందించడమే ఐటీడీఏ లక్ష్యమని పీవో రాహుల్ అన్నారు. భద్రాచలం ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో పీవో గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు. తన పరిధిలోని సమస్యలను వెంటనే పరిష్కరించి.. మిగిలిన వాటిని అధికారులకు పంపించి పరిష్కరించేలా చూడాలని ఆదేశించారు.
ట్రైకార్ ద్వారా సబ్సిడీ రుణాలు, పోడు భూములు, వ్యక్తిగత సమస్యలు, స్వయం ఉపాధి పథకాలకు రుణాలు, పట్టా భూములకు రైతుబంధు వర్తింపజేయాలని, జీవనోపాధి పెంపొందించేందుకు ఆర్థిక సాయం, దీర్ఘకాలిక రోగాలకు వైద్యం చేయించుకునేందుకు సాయం, గురుకులం సీట్లు, పై చదువులకు ఆర్థిక సాయం తదితర సమస్యలపై అర్జీలు వచ్చినట్లు తెలిపారు.
అలాగే గిరిజన సంక్షేమ ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో విద్యార్థినీ విద్యార్థుల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ.. వారిని ఇండ్లకు పంపకుండా విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలని హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ఏపీవో జనరల్ డేవిడ్‌రాజ్, ఎస్డీసీ ఎస్డీసీ రవీంద్రనాథ్, డీడీ మణెమ్మ, ఆర్సీవో నాగార్జునరావు, ఏవో సున్నం రాంబాబు, ఎస్వో భాస్కరన్, ఉద్యానవన అధికారి ఉదయ్‌కుమార్, ఏపీవో పవర్ మునీర్‌పాషా, డీటీఆర్వోఎఫ్ఆర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.