భద్రాచలం, జూలై 10: మారుమూల ఆదివాసీ గిరిజన గ్రామాల్లో గిరిజనులు అనారోగ్యానికి గురికాకుండా చూడాల్సిన బాధ్యత వైద్యాధికారులపై ఉందని, గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి వైద్యసేవలు అందించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం ఐటీడీఏలోని తన చాంబర్లో మెడికల్ ఆఫీసర్లు, సబ్ యూనిట్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పీవో మాట్లాడారు.
ఏజెన్సీ ఏరియా పరిధిలో 113 హైరిస్క్ గ్రామాల్లో గిరిజనులకు శానిటేషన్ పరంగా ప్రత్యేక జాగ్రత్తలు వహించేలా ఏఎన్ఎం, ఆశావర్కర్లతో కోఆర్డినేషన్ చేసుకుని అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వ్యాధులు ఉన్నట్లు నిర్ధారణ అయినట్లయితే వారిని పీహెచ్‌సీలకు తరలించి వైద్యపరీక్షలు చేసి మందులు అందించాలని పేర్కొన్నారు.
సిబ్బంది ఎవరైనా విధుల్లో అశ్రద్ధ వహిస్తే తనకు సమాచారం అందించాలని, గొత్తికోయలకు వైద్యసేవలు అందాలని సూచించారు. గోదావరి వరదలు కూడా పెరిగే అవకాశం ఉండటంతో వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ముంపు గ్రామాలపై దృష్టి సారించాలన్నారు. గ్రామాల్లో గర్భిణులను గుర్తించి వారిని సకాలంలో పీహెచ్‌సీలు, ఆసుపత్రులకు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌వో విజయలక్ష్మి, ఏడీఎంహెచ్‌వో చైతన్య, మలేరియా అధికారిణి స్పందన, వివిధ మండలాల మెడికల్ సబ్ యూనిట్ అధికారులు పాల్గొన్నారు.