భద్రాచలం, మార్చి 6: ట్రైకార్, ఎంఎస్ఎంఈ యూనిట్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారుల ఖాతాలను త్వరితగతిన క్లియర్ చేయాలని ఐటీడీఏ పీవో రాహుల్ బ్యాంకు అధికారులను ఆదేశించారు. ఐటీడీఏలోని తన చాంబర్లో యూనిట్ అధికారులు, బ్యాంకర్లతో ట్రైకార్, ఎంఎస్ఎంఈ యూనిట్లతో గిరిజన నిరుద్యోగులకు జీవనోపాధి పెంపొందించడానికి సబ్సిడీ ద్వారా మంజూరు చేసిన రుణాలు లబ్ధిదారులకు అందేలా బ్యాంకర్లు తీసుకోవాల్సిన కార్యాచరణపై గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020-21, 2021-22లో ట్రైకార్‌కు సంబంధించి యూనిట్లు లాగిన్ అయి గ్రౌండింగ్ చేసిన 70 యూనిట్లను మార్చి 31 నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందేలా చూడాలన్నారు. అర్హులైన లబ్ధిదారులను బ్యాంకర్లు ఇబ్బంది పెట్టవద్దని, వీలైనంత త్వరగా వాటిని క్లియర్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీవో జనరల్ డేవిడ్‌రాజ్, ఏడీ అగ్రికల్చర్ భాస్కరన్, లీడ్ బ్యాంకు మేనేజర్ రామిరెడ్డి, జేడీఎం హరికృష్ణ, వివిధ బ్యాంకుల మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.