భద్రాచలం, నవంబర్ 20 : సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని ఆదివాసీ గిరిజన మహిళలు ఆర్థికంగా ఎదగాలని, పలువురికి ఉపాధి కల్పించాలని ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. పట్టణంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆవరణలో దమ్మక్క లయాబిలిటీ గ్రూప్ గిరిజన మహిళలు నెలకొల్పిన ఎంఎస్ఎంఈ యూనిట్‌ను రాష్ట్ర అటవీ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్యతో కలిసి పీవో బుధవారం ప్రారంభించారు.
యూనిట్లో షాంపూ, సబ్బులు, తేనె, వెదురుతో తయారు చేసిన వివిధ రకాల కళాకృతులను వారు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు తెలుగు రాష్ర్టాలతోపాటు పొరుగు రాష్ర్టాలు, దేశ, విదేశాల నుంచి భక్తులు నిత్యం వస్తుంటారని, ఆదివాసీ గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలు వారికి తెలిసే విధంగా కళాకృతులు ఉండాలని, వాటిని సరసమైన ధరలకు విక్రయించి లాభాలు ఆర్జించాలన్నారు. కార్యక్రమంలో జీసీసీ డీఎం సమ్మయ్య, జేడీఎం హరికృష్ణ, మురళి, రమేశ్, విజయలక్ష్మి, సులోచన, బేబిరాణి, రాజకుమారి, రమాదేవి, భారతి, మంగ, కృష్ణవేణి, సురేశ్, సాయికుమార్, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.