దుమ్ముగూడెం, జూన్ 15 : ‘తమ గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదు. కారు చీకట్లోనే కాలం వెళ్లదీస్తున్నాం. పంటలు పండించుకోవడానికి ఇంకా డీజిల్ మోటర్లను వినియోగిస్తున్నాం. విద్యుత్ సౌకర్యం కల్పించి మా ఊళ్లల్లో వెలుగులు ప్రసాదించండి.. పంటలు పండించుకునేలా చేయండి సారూ..’ అంటూ కొన్ని నెలల క్రితం దుమ్ముగూడెం మండలం సింగవరం, ఎన్ లక్ష్మీపూర్ గ్రామాల్లో పర్యటించిన ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్‌కు ఆయా గ్రామాల ప్రజలు మొరపెట్టుకున్నారు. వారు అడిగిందే తడవుగా.. మీ సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన పీవో మాట నిలబెట్టుకున్నారు. విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించిన ఆయన ఆయా గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం కల్పించాలని సూచించారు. ఇప్పుడు విద్యుత్ వెలుగుల్లో కాంతులీనుతున్నాయి. తమ గ్రామాల్లో వెలుగులు చూసిన గిరిజన ప్రజలు సంబురపడుతున్నారు. అయితే ఆయా గ్రామాల్లో విద్యుత్ పనులను శనివారం పరిశీలించిన పీవో మాట్లాడుతూ పై రెండు గ్రామాల రైతులు విద్యుత్ సౌకర్యం లేక వాగునీటిపైనే ఆధారపడి పంటలు పండించుకునే వారని,
బావులు ఉన్నా కరెంట్ సౌకర్యం లేక డీజిల్‌తో మోటార్లు నడుపుకునే వారని, ఖర్చు ఎక్కువ, ఆదాయం తక్కువ రావడం వల్ల నష్టపోతున్నామని తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. దీంతో ఆయా గ్రామాలకు చెందిన 117 మంది రైతులకు విద్యుత్ సౌకర్యం కల్పించామన్నారు. విద్యుత్ శాఖ సబ్సిడీతో కలుపుకొని ఐటీడీఏ సహకారంతో రూ.18 లక్షల వ్యయంతో విద్యుత్ సౌకర్యం కల్పించి గిరిజన రైతుల కష్టాలు తీర్చామన్నారు. వివిధ శాఖల సమన్వయంతో త్రీ ఫేస్ లైన్‌తోపాటు 25 కేవీ ట్రాన్స్ఫార్మర్లు 8 ఏర్పాటు చేశామని, 11కేవీ లైన్ సమకూర్చామన్నారు. కరెంట్ రాగానే అశ్రద్ధ చేయకుండా సులభతరమైన పంటలు మొక్కజొన్న, రాగులు, పల్లీలు, సజ్జలు, జొన్నలు పండించి అధిక లాభాలు గడించాలన్నారు. కాగా.. కోరిన వెంటనే ఆ రెండు గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడానికి అహర్నిశలు పాటుపడిన ఐటీడీఏ యూనిట్ అధికారులకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏడీ అగ్రికల్చర్ భాస్కరన్, ఏపీవో పవర్ మునీర్ పాషా, కరెంట్ డీఈ జీవన్‌కుమార్, ఏడీ వేణు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.