భద్రాచలం, మే 19: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి, వాటిని పరిరక్షించే బాధ్యతను తీసుకోవాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ అన్నారు. భద్రాచలం ఐటీడీఏ ఆవరణలో జన్ జాతీయ గరిమ ఉత్సవ్-2026, జన్ భాగీదారి సబ్సే దూర్ సబ్సే పహలె కార్యక్రమం సందర్భంగా యూనిట్ అధికారులతో కలిసి పీవో మంగళవారం వివిధ రకాల మొకలు నాటారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏజెన్సీ పరిధిలోని 130 గిరిజన గ్రామాల్లో జన్ జాతీయ గరిమ ఉత్సవ్ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, గ్రామపంచాయతీ కార్యాలయాల ఆవరణలో ఈ కార్యక్రమం కోసం నియమించబడిన అధికారులు మొకలు నాటి, వాటి సంరక్షణ బాధ్యత చేపడతారని పేర్కొన్నారు. మొక్కలను విరివిగా నాటి, పెంచడం వల్ల అవి ఇచ్చే ప్రాణవాయువుతో ఎలాంటి రోగాలు దరిచేరవన్నారు. ఏపీవో జనరల్ డేవిడ్ రాజ్, డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అశోక్, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్, పీవీటీజీ అధికారి గన్య, ఎస్డీసీ ఆనంద్‌కుమార్, ఉద్యానవనాధికారి ఉదయ్‌కుమార్, డీటీఎల్టీఆర్ మనిధర్, ఇల్లెందు ఏటీడీవో భారతీదేవి తదితరులు పాల్గొన్నారు.