భద్రాచలం, ఆగస్టు 8 : భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజనుల సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చించాల్సిన ‘ఐటీడీఏ పాలకమండలి’ 18 నెలలుగా మూగబోయింది. ప్రతి మూడు నెలలకొకసారి సమావేశం నిర్వహించి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. ప్రజాప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. చివరిసారిగా 2024 ఫిబ్రవరి 17న ఐటీడీఏ పాలక మండలి సమావేశం నిర్వహించారు.. అప్పటినుంచి ఇప్పటివరకు ఎటువంటి కదలిక లేదు. మినీ కలెక్టరేట్‌గా ఉండే ఐటీడీఏలో గిరిజనులకు విద్య, సాగు, తాగునీరు, వైద్యం, రోడ్లు, వ్యవసాయంపై నిత్యం ఎదురయ్యే సమస్యలను స్థానిక ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాలు పాలక మండలి సమావేశాల్లో చర్చించి తీర్మానాలు చేసి ఆ సమస్యలను పరిష్కారమయ్యేలా ఐటీడీఏ పర్యవేక్షించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఐటీడీఏ పాలక మండలి సమావేశం ప్రతి మూడు నెలలకొకసారి నిర్వహించాల్సి ఉన్నా అధికార యంత్రాంగం కూడా తమకు పట్టనట్లు అలసత్వం ప్రదర్శిస్తున్నది.
భద్రాచలం ఐటీడీఏ నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉంది. కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న ఐటీడీఏలో ప్రధానంగా వ్యవసాయం, విద్య, వైద్యం, తాగునీటి సమస్యలకు పరిష్కారం చూపాల్సి ఉంది. ఇంకా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై ప్రత్యేక సమీక్ష నిర్వహించాల్సి ఉంది. ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఇక్కడ నివసించే గిరిజనులకు పెద్దపీట వేయాల్సిన ఐటీడీఏ ఏం చేస్తుందో ప్రజలకు అర్థం కాని పరిస్థితి. పాలకమండలి సమావేశం నిర్వహిస్తే మంత్రులు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు గిరిజనుల తరఫున స్థానిక సమస్యలను ఐటీడీఏ దృష్టికి తెచ్చి వాటిని పరిష్కరించేందుకు తీర్మానం చేస్తేనే అవి కార్యరూపం దాలుస్తాయి. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగానైనా పాలకమండలి సమావేశంపై అధికారులు స్పందించాలని గిరిజనులు కోరుతున్నారు.