శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో చట్ట విరుద్ధంగా లావాదేవీలు జరుగుతున్న మ్యూల్ ఖాతాల నెట్వర్క్ను భద్రతా దళాలు రట్టు చేశాయి. ఈ తరహా బ్యాంక్ ఖాతాలకు అంతర్జాతీయ సిండికేట్లతో సంబంధాలు ఉండొచ్చని అనుమానిస్తున్నాయి. అంతిమంగా ఈ ఖాతాల ద్వారా వేర్పాటువాదులకు, జాతి వ్యతిరేక కార్యకలాపాలకు నిధులు అందుతుండొచ్చని భావిస్తున్నాయి. గత మూడేండ్లలో ఈ తరహాలో ఉన్న సుమారు 8 వేల బ్యాంక్ అకౌంట్లను భద్రతా దళాలు గుర్తించి వాటిని ఫ్రీజ్ చేశాయి.
ఇలాంటి ఖాతాలు లేనప్పుడు నేరగాళ్లు తాము దొంగిలించిన నిధులను క్రిప్టో కరెన్సీ లాంటి గుర్తించలేని డిజిటల్ ఆస్తుల్లోకి మార్చడానికి తీవ్రంగా ఇబ్బంది పడతారు. ఈ తరహా బ్యాంక్ ఖాతాల నిర్వహణకు మధ్యవర్తులుగా పనిచేసే ‘మ్యూలర్స్’ను గుర్తించడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జాతి వ్యతిరేక నేరగాళ్లు ‘డిజిటల్ హవాలా’ పద్ధతిలో పని చేస్తూ మ్యూల్ ఖాతాలు, మ్యూలర్స్ సంపాదించిన నిధులను జ్యాతి వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. సాధారణ వ్యక్తులకు సులభ సంపాదన ఆశ చూపి వారి బ్యాంక్ ఖాతాలను మ్యూల్ ఖాతాలుగా నేరగాళ్లు వాడుకొంటున్నారు.