ఆరు గ్యారెంటీలంటూ అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. లబ్ధిదారులకు తెలియకుండానే కొన్ని కొన్ని పథకాలకు మంగళం పాడుతోంది. తాజాగా ఈ కోవలోకే మరో హామీ చేరినట్లుగా ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే.. మహాలక్ష్మి పథకంలోని రూ.500కే వంట గ్యాస్ పథకం. ‘మేం అధికారంలోకి వస్తే రూ.500కే వంట గ్యాస్’ అంటూ కాంగ్రెస్ హామీ ఇవ్వడంతో మహిళలందరూ ఆ పార్టీని ఆదరించి అధికారాన్ని అప్పగించారు. పగ్గాలు చేపట్టిన కొన్నాళ్లకు రూ.500 గ్యాస్ సబ్సిడీ పథకాన్ని అమలు చేస్తున్నామంటూ విస్తృత ప్రచారం చేసుకుంది.
ఆ సమయంలో కొందరి బ్యాంకు ఖాతాల్లో సదరు సబ్సిడీని కూడా జమ చేసింది. దానిని కొద్దిరోజులు కొనసాగించి.. తాము గ్యాస్ సబ్సిడీని నిరాటంకంగా అందిస్తున్నామన్న నమ్మకాన్ని కల్పించింది. తరువాత మెల్లగా సబ్సిడీ నగదును జమ చేయడం తగ్గించింది. మరికొంత కాలానికి మొత్తానికే కాడెత్తేసింది. దీంతో కొన్ని నెలలుగా తమకు గ్యాస్ సబ్సిడీ జమకాకపోవడాన్ని గమనించిన మహిళా మణులు.. బ్యాంకులకు వెళ్లి వాకబు చేయడం మొదలుపెట్టారు. తొలుత నాలుగైదు నెలలపాటు జమ అయిన గ్యాస్ సబ్సిడీ నగదు.. తరువాతి నెలల నుంచి జమ కాకపోవడాన్ని గుర్తించారు. దీంతో.. ‘గ్యాస్ సబ్సిడీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తుస్సుమనిపించింది’ అనుకుంటూ ఉసూరుమంటున్నారు.
-భద్రాద్రి కొత్తగూడెం, మే 18 (నమస్తే తెలంగాణ)
భద్రాద్రి జిల్లాలోని చాలామంది మహిళల బ్యాంకు ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీ నగదు జమ కావడం లేదు. పథకం ప్రారంభించిన తొలినాళ్లలో నాలుగైదు నెలలపాటు సబ్సిడీ మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం జమ చేసింది. దీంతో క్రమం తప్పకుండా తమ ఖాతాల్లో సబ్సిడీ నగదు జమ అవుతుందున్న నమ్మకంలో లబ్ధిదారులు ఉండిపోయారు. అయితే, ఆ నాలుగైదు నెలల తరువాత గ్యాస్ సబ్సిడీ మొత్తం ఏ నెలకు ఆ నెల క్రమం తప్పకుండా జమ కావడం లేదు.
కొన్నిచోట్ల అయితే తొలి నాలుగైదు నెలలు తప్ప ఆ తరువాత ఎప్పుడూ గ్యాస్ సబ్సిడీ బ్యాంకులో జమ కాలేదు. దీంతో అనుమానం వచ్చిన అనేక మంది మహిళలు బ్యాంకుల వద్దకు పరుగులు తీశారు. నెలల తరబడి వాకబు చేశారు. స్టేట్మెంట్లు తీసుకొని పరిశీలించుకున్నారు. ఎన్నిసార్లు తిరగేసి చూసినా తొలుత ఇచ్చిన ఆ నాలుగైదు నెలలు తప్ప ఆ తరువాతి నెలల్లో జమ కాలేదనే స్పష్టతకు వచ్చారు. నమ్మక ద్రోహానికి మారుపేరైన కాంగ్రెస్ ప్రభుత్వ నైజంపై మరింత స్పష్టత తెచ్చుకున్నారు.
పదేపదే దరఖాస్తులిచ్చినా ఫలితం శూన్యం..
అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే ఆరు గ్యారెంటీల కోసం ప్రజాపాలన సభలు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ‘రూ.500కే వంట గ్యాస్’ అనే సబ్సిడీ పథకానికి అందులోనే దరఖాస్తులు స్వీకరించింది. ఆ ప్రజాపాలన సభల్లో దరఖాస్తులు తీసుకున్నప్పటికీ చాలామంది ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీ నగదు జమ కాలేదు.
దీంతో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. గ్రామసభల్లోనూ ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీశారు. దీంతో గ్యాస్ సబ్సిడీ కోసం అదే గ్రామసభల్లో మరోసారి దరఖాస్తు చేసుకోవాలని, గ్యాస్ కంపెనీల్లో కేవైసీ (మీ వినియోగదారుడి గురించి తెలుసుకోండి)ని పూర్తి చేసుకోవాలని, సబ్సిడీ జమ అయ్యేందుకు వినియోగంలో ఉన్న బ్యాంక్ పాస్ పుస్తకాన్ని అందించాలని సూచనలు చేసింది. దీంతో వినియోగదారులందరూ ఆయా ప్రక్రియలను పూర్తి చేశారు. కానీ.. గ్యాస్ సబ్సిడీ మాత్రం జమ కావడం లేదు. దీంతో ఈ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం మెల్లగా ఎగనామం పెట్టిందన్న ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు.
అప్పట్లో ఉరుకులు పరుగులు పెట్టినా..
గ్యాస్ సబ్సిడీ వర్తించాలంటూ గ్యాస్ పుస్తకాలన్నీ మహిళల పేరిటే ఉండాలని, కేవైసీ అప్డేట్గా ఉండాలని, ఆధార్ కార్డులు – రేషన్ కార్డులు – గ్యాస్ బుక్లు అనుసంధానమై ఉండాలని ప్రభుత్వం ప్రకటనలు చేయడంతో, ప్రచారం జరగడంతో ప్రజలందరూ గ్యాస్ కంపెనీల వద్దకు, బ్యాంకుల వద్దకు, మీసేవ కేంద్రాల వద్దకు ఉరుకులు పరుగులు పెట్టారు. రోజుల తరబడి క్యూలలో నిలబడి ఆయా ప్రక్రియలను పూర్తిచేశారు. కానీ.. ఇంత చేసినా గ్యాస్ సబ్సిడీని ప్రభుత్వం వేయకపోవడంపై మహిళలందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 1,47,161 మంది లబ్ధిదారులకు/వినియోగదారులకు గ్యాస్ సబ్సిడీ నగదు జమ అవుతుందంటూ సంబంధిత అధికారులు చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి అలా లేదని గ్రామాల్లో మహిళలు స్పష్టం చేస్తున్నారు. అసలు ఆ పథకం మొదలైనప్పటి నుంచీ తమకు గ్యాస్ సబ్సిడీయే జమ కావడం లేదంటూ వందలాది మంది మహిళలు బ్యాంకుల వద్ద స్టేట్మెంట్లు చూపిస్తూ చెబుతుండడం గమనార్హం. పైగా, ప్రభుత్వం ఇటీవల గ్యాస్ ధరను అమాంతంగా పెంచడంపై భగ్గుమంటున్నారు.
పథకం పెట్టినప్పటి నుంచీ సబ్సిడీ జమ కాలేదు..
అధికారంలోకి రాగానే రూ.500కే వంట గ్యాస్ ఇస్తామంటూ కాంగ్రెస్ వాళ్లు హామీ ఇచ్చారు. కానీ.. ఇప్పుడు రూ.900 ఇచ్చి గ్యాస్ కొనుక్కోవాల్సి వస్తోంది. అయినా తప్పక కొనుక్కుంటున్నారు. ఈ పథకం పెట్టినప్పటి నుంచి మాకు గ్యాస్ సబ్సిడీ జమ కానేలేదు. కాంగ్రెస్ను నమ్మినందుకు మోసం జరిగింది.
-జెర్రిపోతుల లక్ష్మి, రుద్రంపూర్, చుంచుపల్లి
మొదట కొన్ని నెలలే సబ్సిడీ వచ్చింది..
పథకం ప్రారంభించిన కొత్తలో కొన్ని నెలలు మాత్రమే మాకు గ్యాస్ సబ్సిడీ జమ అయింది. గడిచిన నాలుగు నెలలుగా గ్యాస్ తీసుకుంటున్నప్పటికీ సబ్సిడీ నగదు మాత్రం జమ కావడం లేదు. దీంతో పూర్తి డబ్బులు చెల్లించి గ్యాస్ కొనుక్కుంటున్నాం. సబ్సిడీ ఇవ్వని ఈ పథకానికి ‘మహాలక్ష్మి’ అని పేరెందుకు పెట్టారో ప్రభుత్వం చెప్పాలి?
-చిదుమల్ల శ్రీదేవి, మేదరబస్తీ, కొత్తగూడెం
పైసా కూడా పడలేదు..
ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మి పథకంలో భాగమైన గ్యాస్ సబ్సిడీ పథకం మాకు లబ్ధిచేకూర్చలేదు. ఈ పథకం కింద ఇప్పటి వరకూ మాకు పైసా కూడా సబ్సిడీ జమ కాలేదు. చాలాసార్లు బ్యాంకుకు వెళ్లి స్టేట్మెంట్ చూశాను. నిల్ బ్యాలెన్స్ తప్ప ఏమీ లేవు. మాకేగాదు.. మా తండాలో ఎవరికీ సబ్సిడీ జమ కావట్లేదు.
-లకావత్ రాధ, లక్ష్మీపురం తండా, చుంచుపల్లి
సబ్సిడీ నగదు జమ అవుతోంది..
పథకం ప్రారంభమైనప్పటి నుంచీ గ్యాస్ సబ్సిడీ నగదు ఆయా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతూనే ఉంది. కొంతమందికి జమ కావడం లేదని ఇప్పుడే తెలిసింది. కేవైసీ ప్రక్రియ పూర్తికాని వారికి, సాంకేతిక సమస్య ఉన్నవారికి జమ కాలేదేమో. జిల్లాలో 1,47,161 మంది వినియోగదారులు ఇప్పటివరకు 6,31,875 సిలిండర్లను వినియోగించారు. వీరికి రూ.16.56 కోట్లు జమ అయ్యాయి.
-రుక్మిణి, పౌరసరఫరాల శాఖ అధికారి