యాసంగి పంటలు చేతికొచ్చే సమయంలో సాగునీరు సరిపడా లేకపోవడంతో ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం అన్నదాతల ఆశలు ఆవిరవుతున్నాయి. దిక్కుతోచని స్థితిలో ఆవేదనకు గురవుతున్నారు. మండలంలో ఒకవైపు సాగర్ కాలువ ఉధృతంగా ప్రవహిస్తున్నది. మరోవైపు గతంలో తవ్విన ఎస్ఆర్ఎస్పీ కాలువ కూడా అందుబాటులో ఉంది.
వీటికి తోడు గ్రామానికి తలాపున చెరువు కూడా ఉంది. ఆ చెరువులో పుష్కలంగా నీళ్లు కూడా ఉన్నాయి. కానీ.. ఆ నీళ్లు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆ గ్రామ రైతులు వారం రోజులుగా తర్జనభర్జన పడుతున్నారు. కొందరు రైతులు ఇప్పటికే పంటలను వదిలేశారు. మరికొందరు రైతులు వాగులు, బావుల్లో పూడిక తీస్తూ భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ.. ప్రభుత్వం మాత్రం వీరి పంటలను కాపాడేందుకు కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదు.
-ఖమ్మం రూరల్, మార్చి 21
మంగళగూడేనికి చెందిన దాదాపు 5060 మంది రైతులు(వీరిలో సగం మంది కౌలు రైతులు) ఏటా వానకాలం, యాసంగి సీజన్లలో పక్కనే ఉన్న వెన్నారం చెరువు(డోర్నకల్ మండలం) ఆయకట్టు కింద వరి సాగు చేసున్నారు. మరికొందరు రైతులు సమీప వాగులపైనా, తమ బావులపైనా ఆధారపడి యాసంగి పంటలు వేస్తున్నారు. ఈ ఏడాది ఈ గ్రామ రైతుల పరిస్థితి ‘రెంటికీ చెడ్డ రేవడి..’ అనే నానుడిలా దయనీయంగా మారింది. వానకాలం పంటలన్నీ అధిక వర్షాలు, వరదలకు దెబ్బతిన్నాయి.
ఆ లోటును పూడ్చుకునేందుకు ఇప్పుడు యాసంగి వేస్తే కనీసం నీళ్లు అందే పరిస్థితి లేకుండా పోయింది. వెన్నారం చెరువులో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ ఆ మండల అధికారులు తూములు బంద్ చేశారు. దీంతో మంగళగూడెం పొలాలకు నీళ్లు అందడం లేదు. పైగా ఇక్కడ భూగర్భ జలాలు లేకపోవడంతో బావులు కూడా పూర్తిగా అడుగంటాయి. ఈ క్రమంలో పొట్ట దశలో పంటలకు నీళ్లు అందించేందుకు రైతులు చేయని ప్రయత్నం లేదు.
ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం, డోర్నకల్ మండలం వెన్నారం గ్రామాల మధ్యలో ఉన్న చెరువుపై ఆధారపడి మంగళగూడెం రైతులు ఈ యాసంగిలో సుమారు 200 ఎకరాల్లో వరి పంట వేశారు. అయితే, చెరువులోని చేపల కోసమని అక్కడి అధికారులు, రైతులు తూము నుంచి నీళ్లు వదలడం లేదు. ఇదే సమయంలో మంగళగూడెంలో వాగు ఎండిపోవడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడం వంటి కారణాలతో ఇక్కడి రైతులు సాగునీటి కోసం అరిగోస పడుతున్నారు.
పంటలు పొట్ట దశకు చేరుతున్న ఈ సమయంలో సాగునీరు ఎంతో అవసరం. ఈ తరుణంలో నీళ్లు అందకపోతే అవి పూర్తిగా ఎండిపోయే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.వేల అప్పులు తెచ్చుకొని మరీ పెట్టుబడులు పెట్టిన తమ మొరను స్థానిక మంత్రి పొంగులేటి ఆలకించాలని వేడుకుంటున్నారు. చెరువు తూము నుంచి కనీసం రెండు రోజులపాటు నీరు వదిలేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వారం, పది రోజులుగా పొలానికి వరుస తడులు పెడుతున్నాను. ఈ ఏడాది మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి పంట వేశాను. వానకాలంలో వరదలు, భారీ వర్షాలతో ఆ సీజన్లో ఏమీ మిగలలేదు. ఇప్పుడు చూడబోతే ఇట్లుంది. బావులున్నా వాటిల్లో నీళ్లు లేవు. మడిమడికీ పైపులు వేసి సాదుకుంటున్నా. పంట చేతికి రాకపోతే ఆగమవుడు తప్ప ఏమీలేదు.
-మాచర్ల వీరయ్య, కౌలు రైతు, మంగళగూడెం
చెరువు తూము వదిలితే తప్ప పంట చేతికొచ్చే అవకాశం లేదు. రూ.వేలకు వేలు ఖర్చు చేసి పంటను కాపాడుకుంటున్నా. రెండు కిలోమీటర్ల మేర పైపులు వేసుకున్నా. వేరే బావిలో పూడిక తీయించి నీరు తెచ్చుకుంటున్నా. వెన్నారం చెరువులో నీరు పుష్కలంగా ఉంది. చేపల కోసమని వాటిని వదలట్లేదట. కనీసం రెండు రోజులు వాగు సాగినా బాగుండు.
-మేకల సత్యనారాయణ, రైతు, మంగళగూడెం