అశ్వారావుపేట, జనవరి 27 : నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన, కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది. వీటిలో ప్రవేశాల కోసం మైనార్టీ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లావ్యాప్తంగా ఆరు మైనార్టీ గురుకులాలు, ఆరు కళాశాలలు ఉండగా.. వీటిలో 840 సీట్ల భర్తీకి ఫిబ్రవరి 6వ తేదీ వరకు గడువుంది. 5వ తరగతిలో 360, ఇంటర్మీడియట్లో 480 సీట్లు భర్తీ చేయనున్నది. దీంతోపాటు 6, 7, 8 తరగతుల్లో ఖాళీలను కూడా భర్తీ చేసేందుకూ అవకాశం కల్పించింది. మైనార్టీ శాఖ అధికారులు విద్యార్థుల నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రవేశ పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా సీట్ల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు. అయితే గురుకుల పాఠశాలల్లో చేరడానికి విద్యార్థుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉన్నది.
ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
మైనార్టీ గురుకులాలు, కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సీట్లు భర్తీ చేయడానికి మైనార్టీ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఆన్లైన్ (https://tmreistelangana.cgg.gov. in) ద్వారా దరఖాస్తులను స్వీకరిసున్నది. వీటితోపాటు 6,7,8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయనున్నది.
6 పాఠశాలలు, 6 కళాశాలలు
జిల్లాలో 6 మైనార్టీ గురుకుల పాఠశాలలు, 6 కళాశాలలు ఉన్నాయి. వీటిలో 3 బాలికలు, 3 బాలుర గురుకుల పాఠశాలలు, 3 బాలికల గురుకుల కళాశాలలు, 3 బాలుర గురుకుల కళాశాలలు ఉన్నాయి. అశ్వారావుపేట, బూర్గంపాడు బాలికల పాఠశాలల్లో 40 చొప్పున 80 సీట్లు, కొత్తగూడెం గురుకుల పాఠశాలలో 80 సీట్లు, కొత్తగూడెం, ఇల్లెందు, మైనార్టీ బాలుర పాఠశాలల్లో 80 చొప్పున 160, భద్రాచలం గురుకుల పాఠశాలలో 40 సీట్లు ఉన్నాయి. అలాగే అశ్వారావుపేట, కొత్తగూడెం గురుకుల కళాశాలల్లో 80 సీట్లు(ఎంపీసీ, బైపీసీ), బూర్గంపాడు కళాశాలలో 80 సీట్లు(హెచ్ఈసీ, సీఈసీ), కొత్తగూడెం, ఇల్లెందు మైనార్టీ బాలుర కళాశాలల్లో 80 సీట్లు(ఎంపీసీ, బైపీసీ), భద్రాచలం బాలుర కళాశాలలో(హెచ్ఈసీ, సీఈసీ) 80 సీట్లు ఉన్నాయి.
25 శాతం నాన్ మైనార్టీలకు కేటాయింపు
వీటిలో 75 సీట్లు మైనార్టీలతో భర్తీ చేయనుండగా.. మిగతా 25 శాతం నాన్ మైనార్టీలకు రిజర్వ్ చేసింది. నాన్ మైనార్టీ రిజర్వేషన్లలో 12 శాతం బీసీలు, 6 శాతం ఎస్సీలు, 4 శాతం ఎస్టీలు, 2 శాతం ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నది. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలైతే రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.2 లక్షలు ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తు గడువు ఫిబ్రవరి 6వ తేదీతో ముగుస్తుంది.
6 వరకు దరఖాస్తుల స్వీకరణ
మైనార్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఫిబ్రవరి 6వ తేదీ వరకు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థుల మెరిట్ ఆధారంగా సీట్ల భర్తీ ప్రక్రియ ఉంటుంది. ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లు పక్కాగా అమలు చేస్తాం. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– టి.సంగీత, ప్రిన్సిపాల్, మైనార్టీ గురుకుల పాఠశాల, అశ్వారావుపేట