ఖమ్మం అర్బన్, మార్చి 20 : జిల్లాలో 16 రోజులపాటు కొనసాగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారంతో ముగిశాయి. ఏడాదిపాటు అధ్యాపకులు చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటూ పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులు వార్షిక పరీక్షలు ముగియడంతో కేరింతలు కొడుతూ సందడి చేశారు. చివరి రోజు పరీక్ష రాసి కేంద్రాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు.
ఇన్నాళ్లు తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ హాస్టళ్లు, ప్రత్యేక గదుల్లో ఉంటూ చదువుకున్న విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు ముగియడంతో సామగ్రితో ఇంటిబాట పట్టారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో మొత్తం నలుగురు విద్యార్థులు డిబార్ అయినట్లు డీఐఈవో రవిబాబు తెలిపారు. గురువారం జరిగిన పరీక్షల్లో 16,476 మందికి.. 16,033 మంది హాజరుకాగా.. 443 మంది గైర్హాజరైనట్లు డీఐఈవో పేర్కొన్నారు.