ఖమ్మం అర్బన్/కొత్తగూడెం గణేష్ టెంపుల్, మార్చి 6 : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకే విద్యార్థులు కేంద్రాల వద్దకు చేరుకోగా.. వారిని డీఐఈవో ఆదేశాల మేరకు సీఎస్, డీవోలు కేంద్రాల్లోకి అనుమతించారు.
ఖమ్మం జిల్లాలోని 72 కేంద్రాలకు సీఎస్, డీవోలు కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రశ్నాపత్రాలను తరలించారు. సంబంధిత పోలీస్స్టేషన్ల నుంచి ఎస్కార్టు సిబ్బంది సహాయంతో కేంద్రాలకు తరలించారు. గురువారం జరిగిన పరీక్షలో ‘ఏ’ సెట్ ప్రశ్నాపత్రాన్ని అందజేశారు. వేసవి ఎండల దృష్ట్యా ముందస్తుగా మెడికల్ కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను పరీక్షా కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.
గురువారం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఐఈవో రవిబాబు తెలిపారు. జనరల్ విభాగంలో 15,190 మంది విద్యార్థులకు.. 14,867 మంది హాజరైనట్లు డీఐఈవో పేర్కొన్నారు. ఒకేషనల్ విభాగంలో 2,072 మంది విద్యార్థులకు.. 1,988 మంది హాజరుకాగా.. మొత్తం 407 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వివరించారు. ఫ్లయింగ్ స్కాడ్, సిట్టింగ్ స్కాడ్, హైపవర్ కమిటీ సభ్యుల బృందం జిల్లాలోని 42 కేంద్రాలను తనిఖీ చేశారు.
భద్రాద్రి జిల్లాలోని 36 కేంద్రాల్లో ద్వితీయ సంవత్సరం పరీక్ష రాసే విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచే తనిఖీ చేసి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. ఐదు నిమిషాలు సడలింపు ఇవ్వడంతో విద్యార్థులంతా సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. జనరల్ విభాగంలో 7,212 మంది విద్యార్థులకు.. 7,096 మంది పరీక్ష రాయగా.. 116 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1,818 మంది విద్యార్థులకు.. 1,663 మంది హాజరుకాగా.. 155 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారులు తెలిపారు. ఎక్కడా ఎలాంటి మాస్ కాపీ జరగలేదని పేర్కొన్నారు.