ఖమ్మం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 23 : ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ఈ నెల 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు సీసీ కెమెరాల నిఘాలో పకడ్బందీగా నిర్వహించనున్నట్లు డీఐఈవో(జిల్లా ఇంటర్ విద్యాధికారి) కె. రవిబాబు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో చీఫ్ సూపరింటెండెంట్(సీఎస్), డిపార్ట్మెంట్ ఆఫీసర్(డీవో)లతో సమావేశం నిర్వహించారు. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సీఎస్, డీవోలు కీలకమన్నారు. విధులు కేటాయించిన అధికారులు వెంటనే ఆయా పరీక్షా కేంద్రాలను సందర్శించి మౌలిక సదుపాయాలను పరిశీలించి ఏమైనా లోపాలుంటే వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులు నడిపేలా, పరీక్షాకేంద్రాల వద్ద ప్రథమ చికిత్స ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
పరీక్షల కోసం జిల్లాలో 70 కేంద్రాలు ఏర్పాటు చేయగా వీటిల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 26,578 మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. ఎటువంటి మాల్‌ప్రాక్టీస్, దుర్వినియోగాలకు అవకాశం ఇవ్వకుండా పరీక్షలు సజావుగా నిర్వహించాలని సీఎస్, డీవోలకు సూచించారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరిగే పరీక్షల్లో నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని, 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. సమావేశంలో హైపవర్ కమిటీ డాక్టర్ కె శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, సింహాచలం, వీరభద్రం పాల్గొన్నారు.